తెలంగాణ రాజకీయాల్లో రామమందిరం అంశం చిచ్చు రాజేస్తోంది. కావాల్సినంత ప్రచారం దొరుకుతుండటంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు కావాలని మరీ కవ్వించుకుంటున్నట్టుగా ఉంది. మొన్న కోరుట్ల, ఆ తర్వాత కరీంనగర్, ఇప్పుడు పరకాలలో అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి తమ ఉనికిని పెంచుకునేందుకు మరింత ఉపయోగపడుతోంటే..ఆ విషయం అర్థం చేసుకోలేక, కౌంటర్ ఇవ్వబోయి కమలం పార్టీని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు.
వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల సమయం నుంచి బీజేపీ విషయంలో.. అధికార పార్టీ వ్యూహత్మక వైఫల్యం చెందుతోంది. ఆ పార్టీని అణచివేసే చర్యల్లో మరింత బలాన్ని అందిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ సరైన అంశమే లేదు. అలాంటిది రామ మందిరం విరాళాల సేకరణపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీకి వెతబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న ఈ వివాదంపై స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాల్సి వచ్చిందంటే ఆ పార్టీ ఎంత ట్రాప్‌లో పడిందో అంచనా వేయవచ్చు అంటున్నారు విశ్లేషకులు.