మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తు పోలిన ఇతర గుర్తులతో టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. దీంతో గుర్తులపై హైకోర్టులో లంచ్ మోషన్ అనుమతి కోరింది. నవంబరు 3న పోలింగ్ ఉన్నప్పటికీ ఈసీ నిర్ణయం తీసుకోవడం లేదని వివరించింది టీఆర్ఎస్. అయితే.. న్యాయస్థానం భోజన విరామంలో అత్యవసర విచారణకు నిరాకరించింది. మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది సీజే ధర్మాసనం.
మునుగోడులో కారును పోలిన ఎనిమిది గుర్తులు తొలగించాలని కోరుతోంది టీఆర్ఎస్. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను కేటాయించొద్దని అంటోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో వీటి వల్ల పెద్ద సమస్య ఎదురైందని గుర్తు చేస్తోంది.
టీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా గెలవాలని శ్రమిస్తున్న అధికార పార్టీకి గుర్తులే కలవరపెడుతున్నాయి. కారును పోలి ఉన్న గుర్తులతో తొలగించాలని ఈనెల 10న ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని.. తమ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని గత విషయాలను వివరించింది.
అయితే.. సింబల్స్ విషయంలో ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది టీఆర్ఎస్. మునుగోడులో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఇప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం సింబల్స్ కేటాయిస్తుంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం మంగళవారం విచారిస్తామని స్పష్టం చేసింది.