ధర్నాచౌక్ గులాబీమయం అయింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ధర్నాచౌక్ దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు బ్యానర్లతో ఆ ప్రాంతాన్ని నింపేశారు గులాబీ నేతలు.
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతోంది. తలసాని గురించి చెప్పేదేముంది. టీఆర్ఎస్ కు సంబంధించి ఏ కార్యక్రమమైనా నగరంలో ముందు వెలిసేది ఆయన బ్యానర్లే. జీహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం ఫ్లెక్సీలు పెట్టొద్దని చెబుతున్నా ఆయనకు అవేం పట్టవు. అధికారులు కూడా అంతే.. కార్యక్రమం అయిపోయిన తర్వాత తీరిగ్గా వాటిని తొలగించడం.. ఫైన్లు వేయడం జరగుతోంది.
మొన్న ప్లీనరీ సమయంలోనూ అంతే నగరంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలే. ఏదో సాంకేతిక లోపం అంటూ జీహెచ్ఎంసీ చెప్పినా.. ఎవరూ నమ్మలేదు. పైగా ప్లీనరీ అయిపోయాక అంతా ఓకే అవడం.. అప్పుడు ఫైన్లు వేయడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇంత జరిగినా టీఆర్ఎస్ ధర్నా సందర్భంగా అదే తంతు. ధర్నా చౌక్ దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎప్పటిలాగే కార్యక్రమం అయిపోయాక ఫైన్లతో సరిపెడతారులే అని ప్రజలు సైతం కామెంట్ చేస్తున్నారు.