మున్సిపల్ ఎన్నికలు పాలమూరు టీఆర్ఎస్‌లో చిచ్చు రాజేస్తున్నాయి. పార్టీ లైన్‌లో వెళ్లాల్సిందేనంటూ పార్టీ అధినాయకత్వం స్పష్టం చేస్తుండటంతో… పాత-కొత్త నాయకులు మధ్య మనస్పర్ధలు పార్టీలో చీలికకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కొల్లాపూర్‌లో జూపల్లి వర్గం నాయకులు రెబల్‌గా బరిలో ఉండటంతో జూపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టి పట్టు ఉంది. అయితే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవటంతో కాంగ్రెస్ నుండి నుండి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉప్పు-నిప్పులా ఉండే జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డిలా కొల్లాపూర్ రాజకీయం మారిపోయింది. కానీ ఎమ్మెల్యేలకే బాధ్యత ఇవ్వటంతో జూపల్లి వర్గీయులకు టికెట్ దక్కలేదు. దీంతో వారంతా రెబల్‌గా బరిలో ఉన్నారు.
ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిలను పిలిచి మాట్లాడారు. రెబల్స్‌ను విరమించుకోవాలని కేటీఆర్ జూపల్లికి స్పష్టం చేశారు. ఇటు అలంపూర్ నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. జూపల్లి మాత్రం రెబల్స్‌తో తనకు సంబంధం లేదని పార్టీకి స్పష్టం చేశారు. కొందరితో నేను మాట్లాడతానని… విత్‌డ్రా సందర్భంలో వారంతా వెనక్కు తగ్గుతారని జూపల్లి కేటీఆర్‌తో చెప్పారు. కానీ జూపల్లి టీంగా ముద్రపడ్డ నాయకులు ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోకపోవటంతో స్థానిక ఎమ్మెల్యే మరోసారి కేటీఆర్ దృష్టికి విషయం తీసుకరావటంతో అసలు పంచాయితీ మరింత ముదిరింది.
Advertisements
ఇక జూపల్లి వర్గీయులు స్వయంగా జూపల్లి ఫోటో పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు తమ నాయకుడని… తాము కూడా టీఆర్ఎస్ నేతలమేనంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో పార్టీని తప్పుదోవ పట్టించిన జూపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఇక అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఐజా ఎంపీపీగా ఉన్న తిర్మల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తన వర్గం నేతలకు టికెట్ కేటాయించనందుకు నిరసనగా ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయటంతో జిల్లాలో సంచలనం రేపుతోంది.