కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోటి వెంట విన్నా.. కరోనా తప్ప వేరే పదం వినపడట్లేదు. అది ఒక్క రోజు, ఒక్క వారం, ఒక్క నెల ఉండిపోయేది కాదు. గత రెండేళ్లుగా విడతల వారీగా విజృంభిస్తూనే ఉంది. అంతేకాదు ఇప్పటికే అనేక మంది ప్రాణాలను హరించింది. దీనిని హరికట్టేందుకు అనేక నివారణ చర్యలను చేపటడుతున్నాయి ప్రభుత్వాలు. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనాను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి వైరస్ కు టీకాను కనుగొన్నారు. అయితే.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కోవిడ్ ను నివారించే టీకా అందుబాటులోకి వచ్చింది. కానీ.. అప్పటికే సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని చుట్టు ముట్టింది. దీంతో ప్రపంచ దేశాలు సైతం కోవిడ్ టీకాను నిర్విరామంగా అందించాయి. దీంతో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది.
ఇటు భారత్ లోనూ కరోనా కట్టడికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో కేసులు తగ్గుతూ వస్తున్నాయని అధికారులు ఊపిరి పీల్చుకునే సమయానికి.. దక్షిణాఫ్రికాలో మరో వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వంటి దేశాల్లో కోవిడ్ టీకా 75 శాతం జనాభాకు పంపిణీ చేసినా భారీగా కేసులు నమోదవుతూ వచ్చాయి.
ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలతో పాటు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్.. డెల్టా కంటే శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లో విధించాయి. అయితే తెలంగాణలో సైతం కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు 2 ఏళ్లకు ఓసారి నిర్వహించే మేడారం సమ్మక్క-సారక్క జాతర ఈ సమయంలోనే ఉండడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
మేడారం జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. దీంతో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు రాష్ట్రంలో రోజూ 4 వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 10 దాటితే కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని తెలిపారు. అయితే.. మేడారం తరువాత కేసులు పెరిగితే తెలంగాణ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.