తెలంగాణలో నిరుద్యోగులు మరోసారి మోసపోయేలా ఉన్నారు. భారీ ఉద్యోగాల పేరుతో సర్కార్ వారితో ఆటలాడుతున్నట్టే కనిపిస్తోంది. పైగా పాలకపక్షం చేస్తున్న ఈ కుట్రలో ప్రతిప(క్షం)క్షాలు కూడా పాలుపంచుకుంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామకాల ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కావాలనే తప్పటడుగు వేస్తున్నారని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొత్త జోనల్ వ్యవస్థ ఫైల్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లోనే ఉందనే కారణంతో.. పాత పద్దతిలోనే ఉద్యోగాల భర్తీకి
సిద్ధమవుతున్నారు కేసీఆర్. అంటే పాత విధానమైన రెండు జోన్లు, పది జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు నిర్ణయించారు. కానీ ఉద్యోగాల భర్తీకి ఇదే పెద్ద ఆటంకం కాబోతోందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ముందడుగు వేయడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆరేళ్లు దాటింది. వాటికి తగ్గట్టుగా రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లుగా విభజిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను రాష్ట్రపతి వద్దకు కూడా పంపింది. కానీ ఇంతవరకూ రాష్ట్రపతి దానిపై సంతకం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.. పదుల సార్లు ఢిల్లీ వెళ్లినా.. ఏనాడు కొత్త జోనల్ ఫైల్‌పై ఆమోద ముద్ర వేయాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని గట్టిగా కోరింది లేదు. పైగా రాష్ట్రపతి సంతకం పెండింగ్ విషయాన్ని సాకుగా చూపి… ఇన్నాళ్లు జాబ్ నోటిఫికేషన్లే వేయకుండా ప్రభుత్వం కాలం గడిపింది. కానీ ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పలు మున్సిపాల్టీలకు ఎన్నికలు ఉండటంతో.. ఆఘమేఘాల మీద భారీ ఉద్యోగాల భర్తీ అంటూ పెద్ద ప్రకటన చేసింది. అయితే ఆ హడావుడి.. ప్రకటనకు మాత్రమే పరిమితయ్యేలా ఉంది.
పాత జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపడితే..కొన్ని కొత్త జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు కోర్టు గడప తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్తవాటిలో చాలావరకూ చిన్న జిల్లాలే కావడంతో.. పోటీ తక్కువగా ఉండి తమకు ఉద్యోగాలు ఖాయమన్న ధీమాలో ఇన్నాళ్లు వారు ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ పాత పద్దతిలో భర్తీ అంటే వారు అంగీకరించేలా లేరు. ఇలాంటి సమస్య తలెత్తుతుందని ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితే వస్తే.. ఆ నెపాన్ని బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తప్పించుకునే ఆలోచన చేస్తుందన్నది విశ్లేషకుల మాట. ఇదే సమయంలో బీజేపీ కూడా అదే ఆలోచనతో ఉందన్న అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడితే.. టీఆర్ఎస్‌ను బ్లేమ్ చేసేందుకు సిద్ధంగా ఉందని వారు అంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి.. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేసేలా కేంద్రాన్ని, రాష్ట్రపతిని ఒప్పించే అవకాశముంది కానీ వారికి ఇప్పుడు కావాల్సింది. రాజకీయమే అంటున్నారు విశ్లేషకులు. ఇలా అటు అధికార పక్షం, ఇటు అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ బ్యాచ్ కూడా చివరికి నిరుద్యోగులతో ఆటలాడుతున్నాయని వారు విమర్శిస్తున్నారు.