విద్యార్థి ఉద్యమం ప్రతాపం తెలిసిన సీఎం కేసీఆర్… నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉస్మానియాపై నీళ్లు చల్లేందుకు సిద్ధమయ్యారా…? ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఓయూకు అందుకే కేసీఆర్ ఝలక్ ఇచ్చారా…? మరుగున పడ్డ విద్యార్థి నాయకుని చరిత్ర నేటి ఉస్మానియాకు ఊపిరి అవుతోందన్న అనుమానంతో కేసీఆర్ ఉన్నారా…?
ఉస్మానియా శక్తి ఎంతో కేసీఆర్‌కు తెలిసినంత మరే రాజకీయ నాయకుడికి తెలియదు. ఆ శక్తిని ఉద్యమంగా మలచాలి, ఆ ఉద్యమం ఎలా ఓట్లు-సీట్లుగా మారుతుంది… ఎలా అధికారం చేజిక్కుతుంది అనే అంశాలు కేసీఆర్‌కు పక్కాగా తెలుసు. అందుకే సీఎం కేసీఆర్ జార్డిరెడ్డి సినిమా ఫంక్షన్‌కు అనుమతి ఇవ్వలేదన్న ఆరోపణలు ఇప్పుడు ఓయూలో బలంగా వినపడుతున్నాయి. ఆంధ్రా సినిమాలకు, హీరోలకు పన్నులు రద్దు చేసి మరీ అనుమతులు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్… తెలంగాణ విద్యార్థి శక్తి కేంద్ర బిందువు అయిన ఓయూ బిడ్డ అయిన జార్డిరెడ్డి సినిమాకు కనీసం ఫంక్షన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు.
ఓయూ విద్యార్థి ఉద్యమం ఎలా ఉండేది, చదువుల్లో రాణిస్తూ… జార్జిరెడ్డి ఎలా పోరాడారు… అసలు జార్జిరెడ్డి అంటే ఎవరు అనేది నేటి విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని, పైగా ఓ బయోపిక్ పై ఇలా ఆంక్షలా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఓయూ అంటేనే భయపడుతున్నారని, ఇక ఓయూ సింహంలాంటి జార్జిరెడ్డి గురించి భయపడకుండా ఎలా ఉంటారని ఓయూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
శాంతిభద్రతల పేరుతో సినిమా ఫంక్షన్‌కు పర్మిషన్ రద్దు చేశారని… జార్జిరెడ్డి బయోపిక్‌తో ఓయూ మరోసారి చైతన్యవంతం అవుతుందనే కేసీఆర్ ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు చనిపోయినా… ప్రభుత్వాలను భయపెడుతూనే ఉన్నారని స్పష్టం చేస్తున్నారు.
కొంతకాలంగా ఈ పేరు సినిమా వర్గాల్లో మారు మ్రోగుతోంది. తెలంగాణ సమాజంలో మరుగున పడిపోయిన విద్యార్థి ఉద్యమ నాయకుడు. అందుకే జార్జిరెడ్డి బయోపిక్ అనగానే జనంలో విపరీతమైన క్రేజ్ వస్తోంది. ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావటం, జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకోవటమే కాదు… ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు వస్తానని హమీ ఇచ్చాడు. అసలే రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యమం నడుస్తున్న తరుణంలో… పవన్ కళ్యాణ్ అందులోనూ ఓయూ లీడర్ సినిమా ఫంక్షన్‌కు వస్తే పరిస్థితి చేయి దాటుతుందని ప్రభుత్వం భావించి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.