గ్రేటర్ హైదరాబాద్ పై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగురేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాం మొదలుపెట్టిందా…? నవంబర్ నెలాఖరులో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయా…? కేటీఆర్ దృష్టంతా ఇక గ్రేటర్ హైదరాబాదేనా…?
వచ్చే జనవరితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పదవి కాలం ముగియనుంది. గత ఎన్నికల్లో సెంచరీ కొట్టి గ్రేటర్ పై గులాబీ జెండా ఎగురేసిన టీఆర్ఎస్… ఈసారి తన కుర్చీ కాపాడుకునే ప్రయత్నంలో మునిగిపోయింది. అందుకు ఇప్పటి నుండి ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే గ్రేటర్ మంత్రులంతా ఫీల్డ్ లోనే ఉంటున్నారు. వలస కూలీల విషయంలో, లాక్ డౌన్ సమయంలో పేదలకు సరుకుల పంపిణీలో టీఆర్ఎస్ శ్రేణులన్నీ రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టాయి. ఇక మేయర్ బొంతు రామ్మోహన్ అభివృద్ధి పనుల పరిశీలనలో ఉండగా, మంత్రి కేటీఆర్ సైతం కొత్త పథకాల శంకుస్థాపనతో పాటు ఎస్సార్డీపీ కింద చేపట్టిన రోడ్ల పనులు పూర్తి చేసే ప్రణాళికతో పాటు బస్తీ దవాఖానాల ఏర్పాటులో అన్ని శాఖలతో వరుస మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.
ఇక నగరంలో అద్వాన్నంగా తయారైన రోడ్లతో చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో… ప్రైవేటు మెయింటనెన్స్ కు ఇచ్చేశారు. నగరంలోని కీలకమైన మేజర్ రోడ్లన్నీ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన పనులను ఎస్సార్డీపీ కింద చేపడుతున్నారు.
ఈ యుద్ధప్రాతిపదిక చర్యలతో పాటు కొత్త పథకాలను మొదలుపెట్టే ఉద్దేశం వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అంతేకాక గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతుందని గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలు మేల్కొక ముందే ఎన్నికలకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఉందన్న ప్రచారం కూడా జోరందుకుంటుంది.