అధికార పార్టీగా ఉన్న ఏ పార్టీకైనా ఎంతో అడ్వాంటేజ్ ఉంటుందని వినటమే కానీ… టీఆరెస్‌ను చూస్తే నేరుగా చూడవచ్చు. పాలనా సంస్కరణల పేరిట కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా… ఇంతవరకు కలెక్టరేట్ల నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయింది.
ఈ దసరాతో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి మూడు సంవత్సరాలు గడుస్తోంది. ఎంతో ఆడంబరంగా… తమకు ఇష్టం వచ్చినట్లు కొత్త జిల్లాల సంఖ్యను, జిల్లాలను ఖరారు చేశారు. పేరుకు కొత్త జిల్లాలు అయినా… ఇంకా చాల విషయాల్లో ప్రభుత్వం పాత జిల్లాల ప్రాతిపాదికగానే బండి నెట్టుకొస్తుంది.
కాలంతో పోటీపడి కాళేశ్వరాన్ని నిర్మించాం… అంటూ గొప్పలు చెప్పుకునే అధికార పార్టీ, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త కలెక్టరేట్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. స్వయంగా సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన తన సొంత జిల్లా సిద్ధిపేటలోనూ అదే పరిస్థితి. సొంత జిల్లా పనే పూర్తి కాలేదంటే… ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పైగా మంత్రి హరీష్‌రావు నియోజకవర్గంలో కట్టే భవనం అంటే కాస్తయినా వేగం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.
కానీ అదే సిద్దిపేటలో ఏడాది గడవకముందే… టీఆరెఎస్ పార్టీకి కార్యాలయాన్ని మాత్రం నిర్మించుకుంది. ఏడాదిలోగా పనిని దాదాపు పూర్తిచేసుకుంది. తమకు నచ్చిన చోట, ఎలాగు అధికారం ఉంది కదా అని… అతి తక్కువ రేటులో నచ్చిన స్థలాన్ని ఎంపిక చేసుకొని… కాలంతో పరుగుపెట్టేలాగే పార్టీ భవనాన్ని దాదాపు పూర్తిచేసింది.
దీంతో… చేతిలో అధికారం, చుట్టూ కాంట్రాక్టర్లు ఉంటే కాలంతో పోటీయేంటీ, అంతకన్నా స్పీడుగానే పనులు పూర్తవుతాయి అంటున్నారు స్థానిక ప్రజలు.