తెలంగాణ: కేంద్రం తన కోటా బియ్యాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించగా, రెగ్యులర్ గా ఇచ్చే రేషన్ బియ్యం ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన కోటా మేరకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. కిందటి నెల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో 5 కిలోలే పంపిణీ చేస్తున్నారు. దీంతో పేద వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్రం వాటా మాత్రమే ఈ నెలలో 5 కిలోల ఉచిత రేషన్ అందిస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతినెల 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యంతో పాటుగా రాష్ట్ర వాటా ప్రకారం గత నెల వరకు బియ్యం పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంటే.. దానికి భిన్నంగా రాష్ట్ర సర్కారు రేషన్ లో కోత పెట్టింది. ఈ నెలలో కేంద్రం ఇచ్చిన 5 కిలోల బియ్యమే పంపిణీ చేయాలని సివిల్ సప్లయ్స్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ నెల లబ్ధిదారులకు ఉచితంగా అందాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా 2.8 లక్షల టన్నుల ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయినట్లయింది.
రాష్ట్రంలో మొత్తం 90,48,421 రేషన్ కార్డులుండగా.. అందులో 2,87,44,273 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున గత నెల వరకు పంపిణీ చేశారు. కానీ ఈ నెల మాత్రం ఒక్కొక్కరికి 5 కిలోలే ఇస్తున్నారు. పేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోలు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్ కు 5 కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోలు కలిపి యూనిట్ కి 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచిత బియ్యం గడువు పొడిగించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూనిట్ కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్ కు10 కిలోల చొప్పున పంపిణీ చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు.
రూ. 110 కోట్లు తగ్గించేందుకేనా..?
ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద ఇస్తున్న ఉచిత బియ్యానికి ప్రతి నెలా రూ.110 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రం వాటాను ఆపేయడంతో నెలనెలా రూ.110 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. రైతుబంధు, దళిత బంధు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం… పేదలకు బువ్వ పెట్టడానికి ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ లోనూ వేల కోట్లు కేటాయించిన సర్కారు ఇప్పుడు రేషన్ వాటా ఆపేయడంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.