రాష్ట్ర వ్యాప్తంగా రియల్ బూమ్ నడుస్తున్న నేపథ్యంలో…ఆర్టీసీ స్థలాలపై టీఆరెఎస్ నేతల కన్ను పడిందా…? ఎవరి ఇలాకాలో వారు ఎగరేసుకుపోయేందుకు రెడీ అయిపోయారా…? టీఆర్ఎస్ ముఖ్యనేతల కనుసన్నల్లో ఈ గ’లీజు’ వ్యవహరం నడుస్తోందా…? వేల కోట్ల విలువ చేసే భూములపై ఎవరి వాటాలు వారికి వెళ్లిపోతున్నాయా…? అంటే అవుననే తెలుస్తోంది.
జూబ్లీ బస్‌స్టేషన్… సువిశాల ప్రాంగణం. నగరం నడిబొడ్డున ఉంటుంది పైగా మంచి మార్కెట్ ఏరియా. బస్ భవన్ ఇక్కడా అంతే ఫుల్ మార్కెట్ ప్లేస్… వరంగల్, ఆర్మూర్… కరీంనగర్ ఇలా ఎక్కడ వెతికినా ప్రతి జిల్లా కేంద్రంలో, రాజధానిలో కీలకమైన ఏరియాల్లో ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉన్న స్థలాలున్నాయి. ఇప్పుడా స్థలాలే ఆర్టీసీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కడిక్కడ అధికార పార్టీ నేతలు ముఖ్య నేతల కనుసన్నల్లో ఆయా స్థలాలను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న బస్ భవన్‌కు ఆనుకోని 10ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై గతంలో ఎంతో మంది నేతల కన్నుపడ్డా… కార్మికుల ప్రతిఘటనతో ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. కానీ ఈసారి పక్కాగా ఫైల్ రెడీ అయిపోయింది. మరికొద్ది రోజుల్లో ఆర్డర్ కూడా వచ్చేదని తెలుస్తోంది. ఆ స్థలాన్ని కొన్ని ఏండ్ల పాటు ఓ గ్రేటర్ మంత్రి సుపుత్రిడికి ఇవ్వడానికి రంగం సిద్దమయిపోయినట్లు సమాచారం. ఇక్కడ చేపల మార్కెట్ పేరిట దందాకు తెరతీయబోతున్నారు. అందుకే ఆ మంత్రి… ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను, యూనియన్ నేతలను నాలా ఇంకెవ్వరూ తిట్టలేరు అన్నట్లుగా తిట్టిపోస్తున్నారు. ఈ స్థలం విలువ 500కోట్లకు పైమాటే.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కీలక ప్రాంతం వరంగల్. ఇక్కడా కూడా అంతే. ఇప్పటికే వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌కు చెందిన కంపెనీకి లీజుకు ఇచ్చేశారు. ఆ స్థలం విలువ 80కోట్ల వరకు ఉంటుంది.
ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందరికన్నా కాస్త ముందుగానే జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. ఆయనకు ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలం లీజుకిచ్చేయటం, ఆయన ఆ లీజు డబ్బును కూడా ఎగ్గొట్టేయటం జరిగిపోయాయి.
కరీంనగర్ జిల్లాలోనూ అంతే… జిల్లా కేంద్రంలో వేల కోట్ల విలువైన భూములు మాజీ ఎంపీకి ధారదత్తం చేసేశారని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ స్థలం కొంతమేర లీజులో ఉండగా, మిగిలిన స్థలాన్ని కూడా పంచే పనిలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు.
ఇలా బయటకు వచ్చిన వివరాలు ఒకటి రెండే. కానీ ఆర్టీసీకి ప్రతి పట్టణం, డిపోల దగ్గర ఎంతో విలువైన భూములున్నాయి. అవన్నీ ఇప్పుడు ఒకర్ని చూసి ఒకరు… నేతలంతా వాటాల వారిగా పంచుకునేందుకు టీఆర్ఎస్ ముఖ్యనేతలను కలిశారని టాక్ వినపడుతోంది.