– బూత్ లెవెల్లో బలోపేతం
– ప్రజా సమస్యలపై పోరాటం
– చేరికలపై ప్రత్యేక దృష్టి
– ఈటల సారథ్యంలో కమిటీ
– కమలం గేమ్ స్టార్ట్
– సారుకు తప్పదా బ్యాండ్!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సక్సెస్ తో ఫుల్ జోష్ మీదుంది బీజేపీ. ప్రధాని సూచనలతో వేగంగా అడుగులు వేస్తోంది. అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బండి పావులు కదుపుతున్నారు. ప్రత్యేక కమిటీలు, మీటింగులతో బూత్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ గా ఈటల రాజేందర్ ను నియమించారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కేసీఆర్ ను దగ్గరుండి చూసిన నేతల్లో ఈటల ఒకరు. ఆయన ఎలా ఆలోచిస్తారు.? ఎప్పుడేం చేస్తారో అంచనా వేయగలరు. టీఆర్ఎస్ బలం ఏంటో.. బలహీనతలు ఏంటో బాగా తెలుసు. పైగా ఆయనకు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొన్నటివరకు ఆపార్టీలోనే ఉండి వచ్చారు. ఇప్పటికీ కొందరు నేతలు ఆయనకు టచ్ లోనే ఉన్నారు. అందుకే.. అధిష్టానం ఆదేశాలతో కారును బోరుకి తీసుకురావాలనే ప్లాన్ తో.. ఈటల రాజేందర్ ను చేరికల కమిటీకి కన్వీనర్ గా నియమించినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ ను ఆశిస్తున్న పరిస్థితి. కొన్నిచోట్ల అయితే నలుగురు బరిలో ఉన్నారు. నేతలతో కారు ఓవర్ లోడ్ అయింది. ఈక్రమంలోనే విభేదాలు, ఆధిపత్య పోరుతో గొడవలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఈటల సారధ్యంలో చేరికల కమిటీ లక్ష్యం అదేనని అంటున్నారు విశ్లేషకులు. ఒక్క టీఆర్‌ఎసే కాదు కాంగ్రెస్ నుంచి కూడా నేతల్ని బీజేపీలోకి లాగాలనేది ప్లాన్ గా కనిపిస్తోందని చెబుతున్నారు.
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ బలం పుంజుకుంది. అయితే.. చాలా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో బలమైన నాయకులు లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆదేశాలతో బండి సంజయ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈటల నేతృత్వంలో క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులని బీజేపీలో చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఓవైపు ప్రజా సమస్యలపై పోరాటం చూస్తూనే ఇంకోవైపు సంస్థాగతంగా బలపడే దిశగా ముందుకెళ్తోంది బీజేపీ. మోడీ సూచనలతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.