కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ పూటకో మాట మాట్లాడుతుందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేస్తామని, కొత్త చట్టాలతో కేంద్రం రైతుల గొంతు కొస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా భారత్ బంద్ లో పాల్గొన్నారు.
కానీ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్ మాట మార్చారు. యూటర్న్ తీసుకొని కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేస్తామని… ఇక నుండి గ్రామాల్లో పంటలు కొనమంటూ ప్రకటించేశారు. పోనీ ఇప్పుడు ఈ మాట మీద అయినా ఉంటున్నారా అంటే అదీ కనపడటం లేదు.
తాజాగా పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి… కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. కొత్త చట్టాలు వద్దని రైతులు 50రోజులుగా చలిలో పోరాడుతున్నారని, కనీస మద్ధతు ధర కన్నా అధిక మొత్తం రైతుకు వస్తుందని మోడీ చెప్తున్నారని, కానీ మద్ధతు ధర అంశాన్ని మాత్రం చట్టంలో చేర్చటం లేదని విమర్శించారు. కనీస మద్దతుధర ప్రస్తావనే చట్టంలో లేనప్పుడు బహిరంగ మార్కెట్ లో పంటల ధరలకు ప్రామణికత ఏంటి ? రాబోయే కాలంలో ఎఫ్ సీ ఐ వరిధాన్యం కొనుగోలు చేస్తుందా ? లేదా ? కొంటే ఎంత కొంటుంది ? అన్న విషయంలో స్పష్టత లేదని కామెంట్ చేశారు. కేంద్ర కొత్త చట్టాలతో రైతులకు ఎంతవరకు లాభం చేస్తాయో రెండు సీజన్లు ఆగితే తెలుస్తుందన్నారు.
మరీ తెలంగాణ వ్యవసాయ మంత్రికే కొత్త చట్టంపై అనుమానాలున్నప్పుడు… అమలు చేస్తామని సర్కార్ ఎలా ప్రకటించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసం యూటర్న్ తీసుకొని, ఇప్పుడు గల్లీలో మాత్రం కేంద్రంపై తప్పును తోసేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.