మహిళలను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు టీఆరెస్ ప్రభుత్వం చెబుతుండగా…ఆ పార్టీ నేత ఒకరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ జైలు పాలయ్యారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ వారికి సెల్ ఫోన్లకు అసభ్యకర వీడియోలు, ఫోటోలు పంపిన టీఆరెస్ గ్రామ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామానికి కందగట్ల భాస్కర్ టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు.భాస్కర్ గతంలో ఓ ప్రైవేట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసి మానేశాడు. ఇటీవల బీసీ కార్పోరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి జిల్లాలోని కార్పోరేషన్ ఉద్యోగులతో పరిచయం ఏర్పడడడంతో వారితో సన్నిహితంగా ఉంటూ బీసీ కార్పోరేషన్ లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్ధుల ఫోన్ నెంబర్లు, ఫోటోలు వివరాలు సేకరించాడు. వారి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తాను చెప్పిన వారికే అధికారులు ఉపాధి రుణాలు మంజూరు చేస్తారని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన వారు కొంచెం సన్నిహితం కాగానే ఆ మహిళల సెల్ ఫోన్లకు అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపేవాడు. వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారిని కూడా తను చేసినట్టు చేయమనే వాడు. అతడి ప్రవర్తన నచ్చని ఓ మహిళ తన స్నేహితురాలైన కానిస్టేబుల్ కు సమాచారం అందించింది. ఆమె సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించి అతడిపై కేసు నమోదు చేశారు. భాస్కర్ పై విచారణ జరపగా అతనికి నేర చరిత్ర ఉందని..గతంలో 2018 లో ఒకరు, 2019 లో ఒకరు అతనిపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 2007 లో నేలపోగులలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కోర్టు అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించింది.