తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆర్భాటంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్‌లో కుటుంబ రాజకీయాలపై ఆ పార్టీకే చెందిన అరుణ అనే మహిళా నేత నిప్పులు చెరిగారు. సభలో అందరి ముందూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును కడిగిపారేసారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరూ, ముగ్గురూ, నలుగురికి పదవులు ఇవ్వడమేంటని నిలదీసారు. పదవులు వచ్చిన వాళ్లు సమావేశంలో సంతోషంగా మాట్లాడుతున్నారని కానీ.. ఉద్యమంలో తాము పడిన ఇబ్బందులు ఎవరికి తెలుసని అరుణ గట్టిగా ప్రశ్నించారు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరికైనా ఫోన్లు చేయాలంటే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా డబ్బులు ఖర్చయ్యేవి అని, కానీ పది జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళా నేతలకు ఫోన్లు చేస్తూ తాము ఎంతగానో ఖర్చుపెట్టామని గుర్తు చేసుకుని అరుణ బాధపడ్డారు అలాంటి వారికి ఇప్పుడు గుర్తింపే లేకుండా పోయిందని.. అసలు పార్టీలో ఏం జరుగుతోందని నిలదీశారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ సభలకు వెళ్లిన సమయంలో ఎక్కడ బాత్‌రూం వెళ్లాల్సి వస్తుందోనని.. మహిళలంతా రోజంతా నీళ్లు కూడా తాగేవాళ్లం కాదని నాటి సంగతులని తలుచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కొక్క ఇంట్లో భార్యకు, భర్తకు, కొడుకుకు, బిడ్డకు.. ఇలా అందరికీ పదవులు ఇచ్చారని.. కానీ తమలాంటివారిని మాత్రం పట్టించుకునేది లేదా మండిపడ్డారు. ఎవరినో తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేస్తే.. వాళ్లేమో తమ గ్రూప్‌కే పదవులు ఇప్పించుకుంటున్నారని.. తమలాంటి వారంతా రోడ్డున పడ్డారని ఆక్రోశం వెళ్లగక్కారు అరుణ. పదవులు వస్తాయని 20 ఏళ్ల నుంచి ఓపిక పడుతున్నామని, కానీ నిన్నా, మొన్నా వచ్చిన అడ్డమైన వాళ్లకు పదవులిస్తే తామంతా ఏం చేయాలని ప్రశ్నించారు. పార్టీ కోసం ఇళ్లు, పొలాలు అమ్ముకున్న తమ వంటి వారి పరిస్థితి ఏమిటని, ఇంకెన్ని రోజులు భరించాలని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా తాను మాట్లాడేదంతా చూపించాలని ఆమె కోరారు.
అరుణ అలా మాట్లాడుతుండగా అక్కడే కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆమె చేతి నుంచి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించగా.. ఆమె తీరుపైనా అరుణ ఫైర్ అయ్యారు. నీ భర్త మేయర్ అయ్యాడు..నువ్వు కార్పొరేటర్ అయ్యావు.. మరి మా పరిస్థితి ఏమిటి అని నిలదీసారు.
శ్రీదేవితో పాటు మరికొందరు జత కూడి అరుణ నుంచి బలవంతంగా మైక్ లాక్కుని పక్కన కూర్చొబెట్టారు. అరుణ మాట్లాడుతున్న సమయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, గుండు సుధరాణి ఉన్నారు.అరుణ మాట్లాడుతుంటే.. అందరూ చీమకుట్టిన దొంగల్లా ఉండిపోవాల్సి వచ్చింది.