‘‘ఇందుగలరందు లేరని సందేహము వలదు.. ఏ కబ్జా కథ చూసినా అందందే గలరు’’.. రాష్ట్రంలో టీఆర్ఎస్ లీడర్ల కబ్జా బాగోతాలకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. కాస్త జాగా కనిపిస్తే చాలు.. కబ్జా పెట్టడం.. అదేమని అడిగితే అధికార బలంతో బెదిరించడం. ఏడున్నరేళ్లుగా ఇదే తంతు. టీఆర్ఎస్ నేతల కబ్జా లీలలు ఒకటా, రెండా లెక్కలేనన్ని. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో జరిగిన భూదందా ఒకటి వెలుగుచూసింది.
మొన్నామధ్య పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మూడో డివిజన్ కార్పొరేటర్ బల్లి రోజా భర్త శ్రీనివాస్.. భూ ఆక్రమణలకు పాల్పడ్డారని కేసు నమోదైంది.మరో కార్పొరేటర్ ఇంకొందరితో కలిసి అతను మాజీ సైనికుల భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని… తమకు న్యాయం చేయాలని బాధితులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 12 మంది నిందితులపై కేసు నమోదైంది.
మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం ఏంఈఎస్ లో నివాసం ఉంటున్న మాజీ జవాన్ మోతీ సింగ్ కు 1974లో జవహర్ నగర్ ల్యాండ్ కొలనైజేషన్ సొసైటీ ద్వారా సర్వే నంబర్ 266, 267, 268లోని 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూములకు చట్టబద్దత కల్పించాలని, రెగ్యులరైజ్ చేసి, పట్టాలను ఇప్పించాలని హైకోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణలో ఉండగానే మోతీ సింగ్ 2016 ఆగస్టు 22న చనిపోయారు. అతని కుమారులు లాల్ సింగ్, తేజేందర్ పాల్ అప్పటికే ఆ భూమిలో షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అయితే… కొంత భూమిలో తాము యజమానులమంటూ బల్లి శ్రీనివాస్, నరేందర్ పాల్ సింగ్, అమర్ జిత్ సింగ్ తో పాటు కొందరు దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలోనే 2021 అక్టోబర్ 28న ఆ భూమిలో ఉన్న వ్యవసాయ షెడ్లకు తాళాలు వేశారు. కరెంట్ మీటర్, సీసీటీవీలతో పాటు వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేశారు. కొత్త కరెంట్ మీటర్ అమర్చడానికి వెళ్లిన విద్యుత్ సిబ్బందిని కూడా బెదిరించారు. ఈ విషయాలన్నీ బాధితులు కంప్లయింట్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్ తోపాటు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.