అధికారం మనదే.. అడిగేవాడు ఎవడు.. ఎదురు చెప్పేవాడు ఎవడు.. ఇదే ధోరణితో గులాబీ నేతలు రెచ్చిపోతున్నారు. కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వంలోని ఇతర ముఖ్య నేతల కబ్జా లీలలు బయటకు రాగా.. వాళ్ల అనుచరులు సైతం అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు అనుచరుడి కబ్జా బాగోతం బయటకొచ్చింది.
మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో పట్టా భూమిని కబ్జా పెట్టారు గ్రామ సర్పంచ్, అతని అల్లుడు. ఈ విషయమై బాధితుడు నిలదీయగా.. స్వామి మాలలో ఉన్నాడని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. మంత్రి అండదండలతో సర్పంచ్ రెచ్చిపోతున్నాడని.. ఇష్టం వచ్చినట్లు అక్రమాలకు పాల్పడుతున్నాడని అంటున్నాడు బాధితుడు.
ప్రభుత్వ భూములనే కాకుండా.. సామాన్య రైతుల భూముల్ని సైతం వదలడం లేదని… భయపెట్టి, దాడులకు పాల్పడుతూ అప్పనంగా కబ్జా చేస్తున్నారని చెబుతున్నాడు బాధితుడు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు.