- టీఆర్ఎస్ నేతలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత..
- పుష్ప సినిమాపై సింగర్ సాయి చంద్ నోటిదురుసు మాటలు..
- సినిమా తీసినోళ్లను చెప్పుతో కొట్టాలని కామెంట్..
- మండిపడుతున్న అల్లు అర్జున్ అభిమానులు..
ఆవు చేలో మేస్తే దూడ గట్టుకు మేస్తదా అనే సామెతను ఈ టీఆర్ఎస్ నేతలకోసమే కనిపెట్టినంట్టుందనుకోరాదురి. మా లీడరే బూతులు మాట్లాడుతుంటే మేమెందుకు మాట్లాడొద్దు.. మేమేమైనా తక్కువ తిన్నమా అన్నట్టు పోటీ పడి బూతు పురాణం మొదలు పెట్టిర్రు ఈ టీఆర్ఎస్ నేతలు. చక్కని మర్యాద పూర్వకమైన పిలుపులతోటి ఆప్యాయంగా పలుకరించుకునే రాష్ట్రంలో.. ఈ టీఆర్ఎస్ నేతలు తెలుగు బాషను అబాసు పాలు చేస్తుర్రని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నరు.
ఇటు నిన్న గాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని మరిచిపోయి.. దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని తొండికూతలు కూస్తే.. అయన శిష్యులు మాత్రం ఏ మా సారు మంచిగనే మాట్లాడిండని.. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు వంతపాడుతున్నరు. ఈ వ్యాఖ్యల మీద మరోవైపు ప్రజలు, ప్రతిపక్షాలు, దళిత సంఘాల నేతలు తీవ్ర స్ధాయిలో విమర్శిస్తుంటే.. తిడితే గాలికి పోతయ్.. తింటె కమ్మగుంటది అన్నట్టు ఒక్క మాట కూడా పెకలకుండా సల్లబడి ఫాంహౌజ్ లో సేదతీరుతున్నరని సీఎం మీద విమర్శలు వస్తనే ఉన్నయ్. ఇగ ఇటు గురువును మించిన శిష్యులు అనిపించుకోవాలనే కోరికతోటో.. లేకపోతే మాసారు లెక్కనే మేము కూడా మాట్లాడితే తనకేమైనా పదవులిస్తడని ఆశనో తెల్వదు కానీ.. ఆయన శిష్యులు కూడా అదే బూతు బాటలో నడుస్తున్నరని ప్రజలు గుసగుసలాడుతున్నరు.
తాజాగా టీఆర్ఎస్ నేత, ఫోక్ సింగర్ సాయిచంద్ ఓ స్కూల్ మీటింగ్ కు హాజరై మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడాలనుకున్నడో అది మాట్లాడితే వడిశే పోయేది కానీ.. మాటల మధ్యలో పుష్ప సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు బూతులు వదిలిపెట్టిండు. అది ఎలా అంటే ఈ బూతులను వీళ్లే రాసారా అన్నంత దురుసుగా మాట్లాడటంతోటి సినీ వర్గాలు బగ్గుమంటున్నయ్.
ఆయన మాట్లాడుతున్నప్పుడు కొందరు పిల్లలు అల్లరి చేస్తోండ్రని.. వారిని కంట్రోల్ చేసే క్రమంలో ఏ ఆగండ్రా.. ఎందుకు అంత గోల చేస్తుండ్రు. ఈ మాయదారి సినిమాలు చూసే ఈ పోరలు ఇట్ల తయారయ్యిర్రు. ముందుగా ఈ సినిమాలు తీసే ఎదవలను చెప్పుతో కొట్టాలి అని మితిమీరిన మాటలతోటి తన గుణాన్ని బయటపెట్టుకుండని మండిపడుతున్నయ్ సినీ వర్గాలు. హౌలేగాళ్లందరిని తగ్గేదే లేదు అంటూ హీరోలను చేసిన తర్వాత పిల్లలను కంట్రోల్ చేయడం కష్టమైందని మాట్లాడుడుతోటి అల్లు అర్జున్ అభిమానులు విమర్శలు చేస్తున్నరు. పబ్లిసిటీ కోసమే ఇట్ల మాట్లడుతున్నరని మండిపడుతున్నరు.
ఈ సాయిచంద్ కూడా ప్రముఖ ఫోక్ సింగర్. సామాజిక గేయ రచయితగా రాష్ట్ర ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తే. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కూడా చేస్తున్నడు. ఇగ ఇటు ఈ మధ్య ఎమ్మెల్సీ పదవి వస్తది.. మా సారు నాకే పదవి ఇస్తడనే ఆశ గూడా ఉండే కానీ.. చివరికి ఆ పదవి చేయి జారిపోయింది. ఇంకేదైనా పదవి ఇస్తడేమో అని.. తన ప్రశ్నించే పాటను ఫాం హౌజ్ ల బందీని చేసిండని ఇట్ల ఇష్టం వచ్చినట్టు పిచ్చికూతలు కూస్తున్నడని అల్లు అర్జున్ అభిమానులు కొలిమిలేసిన కొరకాసులెక్కనే బగ్గున మండుతున్నరు.
ఇప్పుడు సినిమాల గురించి దురుసుగా మాట్లాడిన ఈ సాయిచంద్ గతంలో ఆయనకు సినిమాల్లో పాటలు రాయటానికి అవకాశం ఇయ్యాలని సినిమా నిర్మాతల చుట్టూ తిరిగిండని.. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పదవి బిస్కెట్లకు ఆశపడి ఆ గుర్తులను మరిచిపోచి మాట్లాడుతోండని విమర్శలు వినిపిస్తున్నయ్. అందితే జుట్టూ అందకపోతే కాళ్లు అన్న ట్టు సాయిచంద్ మాటలు ఉన్నయని సినీ వర్గాలు కామెంట్లు చేస్తున్నరు. ఇది విన్న కొందరు విమర్శకులు మాత్రం అసలు వీళ్లేమైనా బూతు పుస్తకాలు రాసుకున్నరా ఏంది అని అనుకుంటున్నరనుకోరాదురి.