రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎక్కడ సభ పెట్టినా వేలాదిగా జనం తరలివస్తున్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్. ఈ క్రమంలోనే ఒకప్పుడు కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల బాట పట్టిన నేతలు ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్.. కాంగ్రెస్ లోనే చేరతారని ప్రచారం జరుగుతోంది.
అలాగే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కూడా హస్తం గుర్తుకు జై కొడుతున్నారు. తాజాగా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కీలక నేత తీగల సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో కండువా కప్పుకున్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు శ్రీధర్ బాబు. గ్రామాల్లో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.