టీఆర్ఎస్ పాలనలో రాజకీయ నేతల ఆస్తులు విచ్చల విడిగా పెరుగుతున్నాయని.. రాష్ట్రం కోసం పోరాడిన పేదొడు మాత్రం పేదొడిగానే మిగిలిపోయాడన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. టీఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని మండి పడ్డారు. వందకోట్ల విలువైన భూమిని ఎలా టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తారని శ్రవణ్ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ భవన్ కు కూత వేటు దూరంలో.. ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారని నిలదీశారు. సీఎస్ సోమేష్ కుమార్ ప్రభుత్వం సొమ్మును టీఆర్ఎస్‌కు దారాదత్తం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన వెల్లడించారు.
8 సంవత్సరాల్లో వెయ్యి కోట్లు సంపాదించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని ఆరోపించారు శ్రవణ్. టీఆర్ఎస్ నేతలు పేదల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ద్వజమెత్తారు. టీఆర్ఎస్ చేస్తున్న దోపిడి పసిగట్టి.. టీఆర్ఎస్ నేతలు గ్రామలకు వస్తే నడి రోడ్డుపై ప్రజలే గల్లాపట్టి నిలదీయాలని సూచించారు.
ప్రభుత్వ స్థలంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దీనిపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్ స్థలాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు శ్రవణ్.