కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలేమో కానీ పాలకులు మాత్రం నిబంధనలు పాటించట్లేదు అనడానికి ఇదే నిదర్శనం.
సికింద్రాబాద్ మెట్టుగూడలో బస్తి దావఖానను ప్రారంభించడానికి ముఖ్య అతిధిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెళ్ళారు. ఒమిక్రాన్ నేపథ్యంలో తప్పని సరిగా మాస్కులు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్ పెట్టుకోకుంటే వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ ఆదేశాలు రూపొందించింది ప్రజలకు మాత్రమే.. ప్రభుత్వ నేతలకు… పాలకులకు కాదు అన్నట్టుగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల తీరు చూస్తుంటే.
ప్రారంభోత్సవానికి హాజరైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. ఏఎంహెచ్ఓ రవీందర్ గౌడ్ మాస్కులు పెట్టుకోకుండానే పాల్గొనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా పద్మారావు గౌడ్ మాస్క్ పెట్టుకోకపోవడంతో పాటు.. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పెట్టుకున్న మాస్కును తీసి మడిచి జేబులో పెట్టుకోవడం.. అనంతరం కొధ్ది రోజులకే అతనితో పాటు.. కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడడం.. కరోన నుండి కోలుకోకుండానే మాస్క్ లేకుండా బోనాల జాతరలో పాల్గొనడం.. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు అదే తంతు..
థర్డ్ వేవ్ ఒమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన డిప్యూటీ స్పీకర్ మాస్క్ ను ధరించకపోవడం శోచనీయం. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తదా…? అన్నట్టుగా ఆయన అనుచరులు కూడా అదే తీరు. ఆదర్శంగా నిలువాల్సిన నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వ ఆదేశాలు అందరికి సమానమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపైనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు చలానాలు వేయాలని, ఆ నమ్మకాన్ని బతికించాలని ప్రజలు కోరుతున్నారు.