రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ ఏం చేసిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు రోజూ హైదరాబాద్ నుండి వస్తూ పోతూ ఉన్నారు. జాతీయ రహదారిని అద్భుతంగా నిర్మించింది బీజేపీ కాదా..? రేపో మాపో రోడ్డు విస్తరణ కూడా జరగబోతోంది. మెదక్, దుబ్బాక, సిద్దిపేట, ఎల్కతుర్తి వరకు కొత్త రహదారి నిర్మాణానికి గత నెల రూ.690 కోట్లను మంజూరు చేసిన ఘనత నరేంద్రమోడీదే. తెచ్చింది బీజేపీనే. నున్నటి రోడ్లపై వెళ్తున్న ఎమ్మెల్యేలు బీజేపీ ఏం చేసిందని అడుగుతుండటం సిగ్గుచేటు.
2005లో కాంగ్రెస్ పార్టీ హయాంలో రైల్వే మంత్రి లాలూప్రసాద్ మనోహరాబాద్ వరకు రైలు మంజూరు చేసినా 10 ఏళ్లుగా ఒక్క పని చేయలేదు. మోడీ వచ్చాకే నిధులు మంజూరై పనులు చకచకా జరుగుతున్నయ్. ఆ డబ్బులు ఎవరివి హరీష్.. మీ మామ ఇచ్చారా..? చివరకు దాన్ని కూడా మీ ప్రచారానికి వాడుకున్నారు. 13 వేల మంది విద్యా వాలంటీర్లను ఉద్యోగాల నుండి తీసేశారు. 7 వేల 651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ఆర్టీసీలో నూటికి 80 ప్రైవేట్ బస్సులే. డ్రైవర్లకు, కండక్టర్లకు జీతాల్లేవు. యాజమానులకు అద్దెలివ్వడం లేదు. జీతాల్లేక ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అలాగే వేలాది మంది స్టాఫ్ నర్సులను తీసేశారు. 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ కూస్తున్నారు కదా.. మరి వీళ్ల సంగతేంటి..? మీరు ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసినవే ఎక్కువ.
బీజేపీ అంటే అభివృద్ధికి పర్యాయపదం. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం నిధులిస్తోంది. జర్నలిస్టులకు, ప్రైవేట్ టీచర్లకు ఇళ్లు కట్టిస్తామని మూడేళ్ల క్రితం సీఎం చెబితే.. అల్లుడు ఇప్పుడు అదే చెబుతున్నారు తప్ప ఒక్క ఇల్లు కట్టియ్యలేదు. అబద్ధాలాడటంలో హరీష్ ను మించినవారు లేరు. ఆయన గురించి రాస్తే రామాయణం అవుతుంది. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ముంబోజిపల్లి దగ్గరున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ఆ పని చేశారా..? అన్నీ అబద్ధాలే. మార్కెట్ కు వచ్చిన ప్రతీ గింజను మేమే కొంటామని చెప్పారు. తర్వాత మాట తప్పారు. ధాన్యం సేకరణ విషయంలో బస్తాలు, తాడు సహా అన్నీ ఇచ్చేది కేంద్రమే. కానీ.. ఏనాడూ కేసీఆర్, హరీష్ కేంద్రం కొంటుందని చెప్పలేదు.
రెండేళ్లయ్యాక ఓట్లతో కేసీఆర్ కు ఉరివేయడం ఖాయం. వాళ్లు భయపడితే భయపడాల్సిన అవసరం మనకు లేదు. పంట పండినాక ఫాంహౌజ్ దగ్గరకొచ్చి పోస్తాం. ఏం చేస్తారో చూస్తాం. ధాన్యం కొనకపోతే మిమ్ముల్ని ఉరేస్తాం. పేద ప్రజల గొంతుకగా, అణగారిన వర్గాలను అణిచివేయాలని చూస్తున్న ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి అభినందనలు. కళ్లుండి చూడలేని జిల్లా ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేలా పాదయాత్ర నడుస్తోంది.