- కేసీఆర్ సర్కారు జనహితం మరిచిందా..?
- అధికార కాంక్షతో తప్పటడుగులు వేస్తోందా.?
- గ్రూప్ పాలిటిక్స్ తో తలనొప్పి తప్పదా..?
- అప్పుడు క్యూ కట్టిన నేతలు.. ఇప్పుడు యూ టర్న్..!
- ఎన్నికల వేళ గులాబీ కోటకు బీటలు తప్పవా..?
అంతా మా ఇష్టం.. మేము చెప్పిందే ప్రజలు చేయాలి అనే వైఖరి ప్రజాస్వామ్యంలో నడవదు. అది, రాష్ట్రాన్ని, దేశాన్ని నియంతృత్వం వైపు మళ్లిస్తుంది. ఈ వైఖరిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభీష్టాన్ని పక్కనపెట్టి పాలన సాగిస్తోందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. తమ రాజకీయ అవసరాల మేరకే కేసీఆర్ నిర్ణయాలు ఉంటున్నాయి అనే ప్రతిపక్ష నాయకుల వాదన రెట్టింపు అవుతోంది. ప్రజాస్వామ్యంలో ఈ పరిస్థితి అవాంఛనీయం. ఆక్షేపనీయం. తాను తవ్వుకున్న గోతిలో తానేపడ్డట్టుగా మారింది ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి. ఏకపక్ష ధోరణితో పాలన సాగించుదామనే ప్రయత్నంలో సొంతింటికే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు, అసంతృప్తి నేతల వైరంతో సతమతమవుతోంది.
ప్రజలూ, పాలకులు జోడెద్దుల బండిలా కలిసి ముందుకు పోతేనే రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు తీస్తుంది. కానీ.. ప్రభుత్వం ప్రజభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే..? నిరసన తెలిపే హక్కునే కాలరాస్తే..? అది నియంతృత్వమే అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఇదే విధంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. తమను ప్రశ్నించడానికి ప్రతిపక్షమే ఉండొద్దని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ సర్కారుపై.. నిరంకుశ పోకడతో వెళ్తోందని ప్రజలు అంటున్నారు. విపక్షమే లేకుండా చేసి టీఆర్ఎస్ మాత్రమే ఉండేలా ఏకచత్రాధిపత్యం చేయాలనే కేసీఆర్ దురాశ రాష్ట్ర ప్రజలకు ముప్పుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి, ఈ విధానల వల్లనే దుబ్బాకలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకున్న విజయం దక్కలేదన్నది విశ్లేషకుల మాట. జనం మెప్పు పొందాలంటే ప్రజారంజక పాలన సాగించాలి. వారి సంక్షేమాన్ని సంరక్షించాలి. వారి జీవన విధానాన్ని మెరుగు పరిచే నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు పరచాలి. ఇది విస్మరించిన రోజున.. ఏ పార్టీనైనా, ప్రభుత్వాన్నైనా ప్రజలు విస్మరిస్తారు.
తాజాగా టీఆర్ఎస్ పార్టీలో బహుళ నాయకత్వం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కీలక నేతల్లో అసంతృప్తి ఉంది. పార్టీ పదవులు లేకపోవడంతో కొంతప్రాధాన్యత తగ్గడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు కీలకనేతలు పార్టీని వీడుతున్నారు. ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ టీఆర్ఎస్‌ను వీడారు. తమ వర్గం నేతలపై బాల్క సుమన్ వేధింపులకు పాల్పడుతున్నారని, పార్టీలో గౌరవం లేని కారణంగానే తాను టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఓదేలు ప్రకటించారు. తాజాగా మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ బాట పట్టారు. ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీతతో పాటు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడారు. మరికొన్ని చోట్ల పలువురు నేతలు టీఆర్ఎస్‌లోనే ఉంటూ సొంత నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులతో టీఆర్ఎస్ లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరికి మించి టిక్కెట్ ఆశించే నేతలు ఉండటంతో పాటు.. విభేదాలు ముదరడంతో తాజా, మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఐక్యత కుదరడం లేదు. అటు, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో ముసలం ముదిరింది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లారు. కొల్లాపూర్‌లో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో, జూపల్లిని కేటీఆర్ కలవడం జిల్లా రాజకీయాలను హీటెక్కించింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గ్రూపు రాజకీయాలపై జూపల్లితో మంత్రి కేటీఆర్ చర్చించారు. కానీ, ఫలితం లేకపోవడంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ లో వర్గపోరు, అసంతృప్తి నేతల లొల్లి.. పార్టీకి ఎసరుతప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.