గులాబీ రాజ్యంలో పెన్షన్ అడగడం కూడా తప్పయింది. కొండగల్ లో టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోయారు. ఓ సామాన్యుడి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మరీ రక్తం కారేలా కొట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. హకీంపేట గ్రామానికి చెందిన బాలరాజు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ చాలా రోజులుగా టీఆర్ఎస్ నేతల చుట్టూ తిరుగుతున్నాడు. తన అన్న పాస్ బుక్స్ విషయంలోనూ అడుగుతూ వస్తున్నాడు. అతడి విన్నపాన్ని పట్టించుకోక పోగా తమనే ప్రశ్నిస్తావా అంటూ టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో హకీంపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయాల పాలైన బాలరాజును ఆసుపత్రికి తరలించారు. దాదాపు 20 మంది టీఆర్ఎస్ గూండాలు తనపై దాడికి పాల్పడ్డారని వాపోయాడు బాధితుడు. ఇంట్లోకి చొరబడి తనను, కుటుంబసభ్యులను కొట్టారని తెలిపాడు.
వచ్చినవారి తీరు చూసి చంపేద్దామనే వచ్చినట్లుగా అనిపించిందని అంటున్నాడు బాలరాజు. మూడు కార్లలో వచ్చారని అందరూ టీఆర్ఎస్ కు చెందినవారేనని చెప్పాడు. ముందు పది మంది రాగా.. తర్వాత మరో పది మంది వచ్చి దాడి చేసినట్లు వివరించాడు. తమ ఊరికి చెందిన టీఆర్ఎస్ నాయకులే తన వివరాలు చెప్పి ఉంటారని అన్నాడు. పింఛన్ అడగడమే తప్పయిందని వాపోయాడు బాలరాజు.