దసరా వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ సామాన్యుడిపై దాడికి దిగారు టీఆర్ఎస్ నేతలు. పక్కనే ఉన్నా పోలీసులు చూస్తున్నట్లు నిలబడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పై స్పందిస్తున్న నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
తుపాకి శీనన్న దండు అరాచకం … పక్కనే కాకీ బట్టలు వేసుకుని నిలబడ్డ పోలీసుల తమాషా గులాంగిరి అద్భుతం pic.twitter.com/hVtqMyOqac
— Teenmar Mallanna (@TeenmarMallanna) October 6, 2022
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని విజయదశమి పండుగ వేడుకల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బాణాసంచా కాల్చే వ్యక్తిపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. మంత్రి ప్రసంగిస్తుండగా బాణాసంచా ఎందుకు కాల్చావ్.. అంటూ చితకబాదారు. బండ బూతులు తిడుతూ.. చెంపలపై కొడుతూ ఆ వ్యక్తిపై దాడి చేశారు.
ఆ సమయంలో మంత్రి, కలెక్టర్, ఎస్పీ అక్కడే ఉన్నా ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు. టీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చే వ్యక్తిపై దాడి చేస్తుండగా.. అక్కడున్న కొంతమంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తుపాకీ శీనన్న దండు అరాచకం., పక్కనే ఖాకీ బట్టలు వేసుకుని నిలబడ్డ పోలీసుల తమాషాలు చూస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అతను ఏం తప్పు చేశాడని అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.