జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించినప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య వార్ మొదలైంది. ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీని దోషిగా నిలబెట్టుందుకు శతావిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
తాజాగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను ఆయుధంగా చేసుకుని బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. పెరుగుతున్న ఆ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయంటూ తీవ్రంగా టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు.
ఇక ఆ పార్టీ నేత, మంత్రి కేసీఆర్ అయితే ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి మోడీ గతంలో చేసిన ట్వీట్ లను ప్రధానికే రీ ట్వీట్ చేశారు. మీ పూర్వపు మాటలను పునరుద్ఘాటిస్తున్నామంటూ పేర్కొన్నారు. మిషన్ భగీరథలో కేంద్రం వాటా ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సహాయం లేకున్నా ఇలా ప్రచారం చేసుకోవడం తగదంటూ ప్రధాని స్థాయిపై మాట్లాడారు.
కానీ కేటీఆర్ చేసిన కౌంటర్లు మిస్ ఫైర్ ఆ పార్టీనే తాకుతున్నాయి. మోడీని ఎదుర్కొనే సత్తాలేకనే టీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఇక పెట్రోల్ ధరలపై టీఆర్ఎస్ కారుస్తున్న ముసలి కన్నీళ్లపై నెటిజన్లు తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న పెట్రోల్ ధరలతో తెలంగాణలో రేట్లను పోల్చి మరీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్రలతో పోలుస్తూ… ఇప్పుడేమంటారు కేటీఆర్ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
మీరు ఏ పార్టీపై అయితే విమర్శలు చేస్తున్నారో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉన్నాయి. మరి మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రేట్లు ఎలా ఉన్నాయో ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అడుగుతున్నారు.