నల్గొండ సాక్షిగా కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. త్యాగాలు ఒకరు చేస్తే.. పదవులు మరొకరు అనుభవిస్తున్నారని ఆయన చేసిన విమర్శనాస్త్రాలు గులాబీ నేతలకి గట్టిగా గుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా ఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.
ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే గాదరి కిషోర్ విమర్శించారు. అంటే ఆయనకు పదవి వస్తే రాజ్యాధికారం వచ్చినట్లా..? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ అంబేద్కర్ లా ఫీల్ అవుతున్నారని… ఆయన బీజేపీ కుట్రలో భాగంగానే తెరపైకి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. గురుకులాలు తెచ్చింది కేసీఆర్ అయితే.. దాని ఫలితాన్ని ప్రవీణ్ కుమార్ తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు కిషోర్.
ఇక దళిత బంధును చూసి కొందరు వణికిపోతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఈ పథకంతో ఆ వర్గాలను ఎలా బాగుచేయాలో.. ఆర్ఎస్ ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు. కేసీఆర్ ను తిడితే నాయకులు కాలేరని సెటైర్లు వేశారు సైదిరెడ్డి.