టీఆర్ఎస్ నేతల కన్నీళ్లతో సోషల్ మీడియా తడిసి ముద్దవుతోంది. చోటా, మోటా, బడా అనే తేడా లేకుండా.. అందరూ ఏకధాటిగా ఏడ్చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా మంత్రుల నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ఏడ్చీ ఏడ్చి కళ్లు ఎర్రబడుతున్నాయి. ఒక సీనియర్ నేతని పట్టుకుని ఇంతలా అవమానిస్తారా? ఇంత ఘోరంగా మాట్లాడతారా.. అని గంటల తరబడి శోకాలు పెడుతూనే ఉన్నారు. కనీసం ఆ లీడర్ వయస్సుకో, పార్టీకి చేసిన సేవలకైనా గౌరవం ఇవ్వరా అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇదేనా తెలంగాణ సంస్కృతి, ఇదేనా మర్యాద అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్‌ని గాడిద అని సంబోధిస్తారా అని.. రేవంత్ రెడ్డిపై ముప్పేట దాడికి దిగారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా..అందరికందరూ నేతలు ఏకమై గొంతు విప్పుతోంటే.. శశిథరూర్‌కు ఒకరివెంటన ఒకరు తమ సానుభూతి ప్రకటిస్తోంటే.. ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. శశిథరూర్‌ని ఆఫ్‌ది రికార్డు గాడిద అని సంబోధించినందుకు ఇంతలా ఆగమైపోతున్న అధికార పార్టీ నేతలు.. అంతకంటే బండబూతులతో కేసీఆర్‌ని తిట్టినప్పుడు ఎందుకు స్పందించలేదబ్బా అని ఆలోచనలో పడ్డారు. తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకూ కేసీఆర్‌ని ఉద్దేశించి.. రోజూ వందలాది తిట్లు తొడుతోంటే ఈ గులాబీలకు కన్నీళ్లు ఎందుకు రావడం లేదో అని నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నేతను తిట్టుకుంటే చొక్కాలు చింపుకుంటున్న టీఆర్ఎస్ నేతలు.. ఎందుకు ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారో అర్థం కాక జనాలు అయోమయంలో పడ్డారు.
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి మొదలు.. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, నన్నపనేని నరేందర్, క్రాంతి కిరణ్, ముఠా గోపాలు, ఆరూరి రమేష్, కాలేరు వెంకటేష్, అల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేంద్ రెడ్డి.. ఇలా అందరూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. శశిథరూర్‌ని పట్టుకుని అంత మాట అంటావా అంటూ.. బాధపడుతోంటే శశిథరూర్ టీర్ఎస్‌లో చేరారా లేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరారా అని గందరోగోళంలో పడ్డారు.