ఇంకా కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక. సర్వేలేమో తేడా కొడుతున్నాయి. గెలిచే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. ఎన్ని చేసినా వర్కవుట్ కావడం లేదు. కోట్ల కొద్దీ నిధులు గుమ్మరించినా పట్టించుకోవడం లేదు. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నా గ్రాఫ్.. డౌన్ అవుతుందే గానీ పెరగడం లేదు. ఏం చేయాలా అని ‘మందు బంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు టీఆర్ఎస్ నేతలు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి అక్రమంగా మద్యం డంప్ అవుతోంది. ఇదంతా ఎవరి పనా అని తొలివెలుగు ఆరా తీస్తే.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరిన రాయల్ స్టాగ్ డీలర్ సర్గం రవి అని తేలింది. బాక్సులకు బాక్సులు హుజూరాబాద్ చేర్చడంలో అతనిదే కీలకపాత్ర అని చెప్పుకుంటున్నారు ప్రజలు. దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా తొలివెలుగు కెమెరాకు చిక్కాయి.
హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా రాయల్ స్టాగ్ మద్యమే కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు గులాబీ నేతలు. ఊరూరా వ్యాన్ లో తరలిస్తున్నారు. ఎన్నిక నాటికి ప్రజల చేత బాగా తాగించి ఓట్లు దండుకోవాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు. పోలీసులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నాయి.