కరోనా విజృంభిస్తున్న వేళ.. ఎన్నికలు నిర్వహించొద్దని ప్రజలే స్వచ్ఛందంగా కోరినా మొండిగా నిర్వహించి తీవ్ర పర్యవసనాలకు కారణమైంది కేసీఆర్ ప్రభుత్వం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో వరుసగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు సాధారణంగానే కనిపించినప్పటికీ… ఇంకుబేషన్ పిరియడ్ పూర్తి కావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే 9 మంది కార్పొరేటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇతర నేతలు, కార్యకర్తలు కూడా దీని బారినపడుతున్నారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసి ఆంజనేయులు అనే కార్యకర్త ప్రాణల మీదకు తెచ్చుకున్నాడు. వరంగల్‌లో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగిన అతనికి కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే చికిత్స కోసం ఆస్తులు అమ్మి రూ. 4 లక్షల వరకు ఖర్చుచేశానని.. పార్టీ కోసం పనిచేసిన తనని ఏ నేతా పట్టించుకోవడం కన్నీటి పర్యంతమవుతున్నాడు. తను ప్రాణాలు కాపాడాలని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు.