– బీజేపీకి టచ్ లో గులాబీలు!
– జూపల్లి అంతా మాట్లాడేసుకున్నారా?
– అదే నిజమైతే ఆయన బాటలో ఇంకెందరు?
– తుమ్మల దారెటు..?
– కాంగ్రెస్ నేతలపైనా బీజేపీ ఫోకస్!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలు కరెక్ట్ అయి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. కానీ.. ఆయన అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి. దెబ్బకు భయంతో హాస్పిటల్ కు వెళ్లారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతో సతమతం అవుతున్న కేసీఆర్ కు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఫలితాలు కొంప ముంచే పరిస్థితికి తీసుకొచ్చాయని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. చాలామంది గులాబీ నేతలు వలస బాట పట్టనున్నారని చెబుతున్నారు.
ఈ ఫలితాలు కేసీఆర్ కు భయం పుట్టిస్తే.. బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని పెంచాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బయటికి వస్తారనే అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని గట్టిగా ఫిక్స్ అయిన రాష్ట్ర బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ ను సైలెంట్ గా కానిచ్చేస్తున్నారని చెబుతున్నారు. ముందుగా అసంతృప్త నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని అంటున్నారు.
కొద్ది రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి కీలక నేతలు టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీలు ఈ విషయాన్ని కొట్టిపారేసినా.. బీజేపీ మాత్రం చాపకింద నీరులా తన ప్రయాత్నాలు సాగించిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావుతో సంప్రదింపులు అయిపోయాయని.. ఆయన కూడా చేరికపై సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
జూపల్లిపై జరుగుతున్న ప్రచారం నిజమైతే.. ఆయన బాటలోనే ఇంకా చాలామంది టీఆర్‌ఎస్ నేతలు పయనించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు తీరు కూడా తేడాగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. పాలేరు నుంచి టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆయన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఓ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఓవైపు కేసీఆర్ పని అయిపోయిందని బీజేపీ విమర్శలు చేస్తోంది. రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతోంది. దీనికితోడు సీఎం గ్రాఫ్ తగ్గిపోవడం.. ప్రజా వ్యతిరేకత పెరగడం.. ఇలా అనేక అంశాలను బేరేజు వేసుకుని చాలామంది టీఆర్‌ఎస్ నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. అటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు నేతల అసంతృప్తికి కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలపైనా బీజేపీ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు విశ్లేషకులు.