సాగునీటి ప్రాజెక్టు అసలు లెక్కలు, అవినీతి గురించి మాట్లాడకుండా టీఆర్ఎస్ మంత్రులు సభను పక్కదారి పట్టించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు..? దానికి ఎంత విద్యుత్ వినియోగించారు..? దానికి ఎంత ఖర్చయింది..? వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శాసనసభ సాక్షిగా అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ నేతలను అవమానించారని ఆరోపించారు. సభలోని ప్రతిపక్ష నేతలను గౌరవించకుండా.. వారు చేసే వృత్తులను బట్టి పిలవడం సరికాదన్నారు భట్టి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పదేపదే కాంట్రాక్టర్ అనడం వారి నిర్లక్ష్య దోరణికి అద్దం పడుతోందని అన్నారు.
శాసనసభ్యులందరికీ వృత్తులు ఉంటాయని.. వారి వృత్తి గురించి సభలో మాట్లాడాల్సిన అవసరం లేదని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు వంత పాడేలా తాను కూడా కాంట్రాక్టర్ నే అని స్పీకర్ పోచారం చెప్పడం బాధను కలిగించిందని నిరాశ వ్యక్తం చేశారు.
సభలో మంత్రులు, టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీని కించపరచకుండా గౌరవంగా మాట్లాడాలని కోరారు. పదేపదే అవమానించడం వల్ల అధికారపార్టీ పరువే పోతుందని హితవు పలికారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామని భట్టి సూచించారు.