ప్రస్తుతం తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ కొనసాగుతోంది. శనివారం అమిత్ షా రాక తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరో రేంజ్ లో జరుగుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీకి షాక్ తగిలింది.
వనస్థలిపురం టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అంజన్ గౌడ్ సహా వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఎల్బీ నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వారందరినీ బండి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ కి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పార్టీలో చేరికల తర్వాత బండి ఎల్బీ నగర్ నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లారు.
రానున్న రోజుల్లో టీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు బీజేపీలోకి ఉంటాయని చెబుతున్నారు కమలనాథులు. వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.