- అధికార పార్టీకి షాకిచ్చిన ప్రజా ప్రతినిధులు
- కారు దిగిన ముగ్గురు కౌన్సిలర్లు
- ఉత్తమ్ సమక్షంలో హస్తం గూటికి
- హుజూర్ నగర్ లో నిలకడ కోల్పోయిన రాజకీయం
- ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దోబూచులాట రసవత్తరంగా మారింది. ఈ మధ్య కాలంలో ఓ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి కాంగ్రేస్ లో చేరాక.. తెల్లారేసరికి మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్లడం తెలిసిందే. నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా పట్టుకోసం పాకులాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు కౌన్సిలర్లు అధికార పార్టీకి షాక్ ఇచ్చారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కారు దిగి నల్లగొండ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారడంతో పాటు కార్యకర్తలు, ప్రజలను కొంత అయోమయంలోకి నెడుతున్నాయి.
ప్రస్తుతం నేతల వలసలతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ పోటీ నెలకొంది. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వారిలో నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన నాలుగో వార్డు కౌన్సిలర్ షేక్ బాషా, ఆరో వార్డు కౌన్సిలర్ తాళ్లూరి సాయిరాం,మూడో వార్డు కౌన్సిలర్ షహనాజ్ కరిముల్లా ఉన్నారు.
మొత్తానికి కప్పదాట్ల నేతల తీరుతో రాజకీయాలు నిలకడ కోల్పోయాయని, ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియక నియోజకవర్గ ప్రజలు కూడా కొంతమేరకు అయోమయంలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.