తెలంగాణలో గులాబీ నేతల భూదందాలకు హద్దు, సరిహద్దులనవే లేకుండా పోయాయి. పల్లె, పట్టణం అనే తేడా లేదు.. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఎక్కడైనా బోర్డు పాతేస్తున్నారు. ఇప్పటికే కబ్జాలకు అడ్డాగా మారిపోయిన మేడ్చల్ జిల్లాలో.. తాజాగా మరో భూబాగోతం బయటపడింది. గిరిజనుల సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన భూమిపై కొందరు బడాబాబులు కన్నేస్తే.. దానికి గులాబీ నేతలు సహకరిస్తూ స్వాహా చేస్తున్నారు.
రావల్‌కోల్ పరిధిలోని సైదోనిగడ్డ తండాను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీకి సామాజిక ప్రయోజనాల నిమిత్తం 747 సర్వేనెంబర్ లో మూడు ఎకరాల 32 గుంటల భూమిని కలెక్టర్ కేటాయించారు. ఈ మేరకు పంచాయితీకి రాసి ఇస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. 44వ నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న తండాలో ఎకరా భూమి బహిరంగ మార్కెట్లో 5 కోట్ల రూపాయల పైమాటే. ఇంతటి ఖరీదైన భూమికి సర్వే చేసి హద్దులు చూపడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
ఈ భూమి పక్కనే వెలసిన నార్నియా ఎస్టేట్స్ , గోల్డెన్ హైట్స్ వెంచర్లకు వెళ్లేందుకు పంచాయతీ భూమిలో నుంచి పెద్ద పెద్ద రోడ్లు నిర్మించారు. ఈ విషయమై తండా వాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న ఓ బడా నేతకు ఇందులో ప్రమేయం ఉండటంతో… అధికారులు ఎందుకు వచ్చిన తలనొప్పి అని మిన్నకుండిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు గిరిజనుల భూమిని నిర్భయంగా ఆక్రమించుకుంటున్నారని మండిపడుతున్నారు. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులకు కూడా దిక్కు లేదని వాపోతున్నారు.
నార్నియా ఎస్టేట్ డీటీసీపీ లేఅవుట్ చేసిన 1997లో 747 సర్వే నంబర్ ను డాక్యుమెంట్లలో పూర్తిగా ప్రభుత్వ భూమిగా చూపారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తండావాసులు చెబుతున్నారు. దీన్నిబట్టి నార్నియా యాజమాన్యం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్టు స్పష్టం అవుతుందని ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుని, గ్రామ పంచాయతీకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.లేదంటే భూమిని తిరిగి పంచాయతీకి అప్పగించే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.