టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు గులాబీ నేతలు. వినోద్ కుమార్ బృందం తీర్మానం కాపీని అధికారులకు అందజేసింది. పేరు మార్పునకు ఆమోదం తెలపాలని నేతలు కోరారు. ఈ బృందంలో పలువురు న్యాయవాదులు, పార్టీ నేతలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
అధికారులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు వినోద్. ఏ పార్టీ అయినా ఆ పార్టీ పేరును, చిరునామాను మార్చితే వేంటనే ఎలక్షన్ కమిషన్ కి తెలియజేయాలని.. పీపుల్స్ రిప్రజెంటివ్ యాక్ట్ సెక్షన్ 29ఏ(9) లో స్పష్టంగా ఉందన్నారు. అందుకే సమయం వృథా చేయకుండా తాము వెంటనే.. ఈసీని కలిశామని తెలిపారు. మిగతా విషయాలు ఎలక్షన్ నిబంధనలు అనుసరించి ఉంటాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు సీఎం కేసీఆర్. ఈ మేరకు బుధవారం తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని వినోద్ బృందానికి అప్పగించి ఢిల్లీ పంపించారు. ఈక్రమంలోనే పేరు మార్పునకు ఆమోదం తెలపాలని ఆ బృందం ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపితే.. అధికారికంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారుతుంది.