పవర్ ఉంది కదా అని ప్రతీచోట రెచ్చిపోతోంది గులాబీ గ్యాంగ్. రాష్ట్రంలో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేయడం.. అధికారులను సైతం బెదిరించడం కామన్ అయిపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దేవాదాయశాఖ అధికారిని బెదిరించిన ఘటన వెలుగు చూసింది. మాతో కలిసిపోండి చెక్కులు ఇస్తాం అంటూ బేరసారాలు కూడా సాగించింది గులాబీ గ్యాంగ్.
వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయానికి కొన్ని భూములు ఉన్నాయి. వాటిపై స్థానిక గులాబీ నేతల కన్నుపడింది. సైలెంట్ గా కబ్జా పెట్టేశారు. ఈ విషయం మహబూబాబాద్ డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవితకు తెలిసి తన సిబ్బందితో అక్కడకు వెళ్లారు. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ప్రయత్నించారు.
అయితే.. కవితను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు.. తమతో కలిసిపోవాలని బేరసారాలు నడిపారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో రాళ్ల దాడికి కూడా పాల్పడ్డారు. దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అడగడానికి వెళ్తే దాడికి పాల్పడ్డారని పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు అధికారులు.
ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ను అభ్యర్థిస్తూ.. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత వీడియో విడుదల చేశారు. దేవుడి భూములను ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. మాటేడు గ్రామ టీఆర్ఎస్ నాయకులు దేవాదాయ భూమి కబ్జా చేశారని వివరించారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తే.. తనకు చెక్కులు లంచంగా ఇస్తామని బేరసారాలు చేశారని ఆరోపించారు.
టీఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలపై ఫొటోలు, వీడియోల ఆధారాలతో మీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు వివరించారు కవిత.