– ధర్మారెడ్డికి సొంతపార్టీ నుంచే వార్నింగ్
– అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం
– తీరు మారకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక
వరంగల్,తొలివెలుగు:టీఆర్ఎస్వీకి చెందిన శరత్ చంద్రపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్రమ కేసులు పెట్టారని కేయూ జాక్ నేతలు మండిపడ్డారు. వెంటనే అక్రమ కేసులను విరమించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. శరత్ చంద్రపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేయూ జాక్ వ్యవస్థాపక సభ్యులు మంద వీరస్వామి. స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్రస్థాయి నాయకుడు పాలమాకుల కొమురయ్య మాట్లాడుతూ.. పరకాల ఎమ్మెల్యే బీఆర్ఎస్వీ నాయకులపైన అక్రమ కేసులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తన వ్యాపారం కోసం బీఆర్ఎస్వీ నాయకులపైన పోలీసులను అడ్డుపెట్టుకొని కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
గత 15 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ విద్యార్థి భాగంలో పనిచేశాన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేశామని, తనను ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే ధర్మారెడ్డి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలుస్తామని న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
వీరస్వామి మాట్లాడుతూ.. ఉద్యమకారులను ఎమ్మెల్యే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో ఈ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? అంటూ ప్రశ్నించారు. పరకాల నుంచి హుజూరాబాద్ రూ.100 కోట్ల కాంట్రాక్ట్ తో ఆ చుట్టు పక్కల గ్రామాలన్నీ బొందలగడ్డగా మార్చారని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగాన్ని, దళితులను కూడా ధర్మారెడ్డి అవమానపరిచాడని మండిపడ్డారు.
తెలంగాణ సాధించిన ఉద్యమకారుల మీద అక్రమంగా కేసులు పెట్టడం సరైన పద్దతి కాదంటూ ఫైరయ్యారు. ఉద్యమ కారులతో, యూనివర్శిటీలతో పెట్టుకుంటే.. తమ ప్రతాపమేంటో చూపిస్తామన్నారు. పార్టీ ఆఫీసు అంటే ఒక పేదవాడికి న్యాయం జరిగే విధంగా ఉండాలి కానీ, కాంట్రాక్ట్ లు, కమీషన్ల కోసం కాదని చెప్పారు.