బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటానికి దిగారు టీఆర్‌ఎస్ నేతలు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనదీక్ష చేపట్టారు. పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి.. విభజన చట్టంలో పొందుపరిచి ఇప్పుడు కర్మాగారం రాదని కిషన్ రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు టీఆర్‌ఎస్ నేతలు. పైప్ లైన్ ద్వారా ముడి ఇనుము సరఫరా చేసినా ఖర్చు భరిస్తామని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే కేసీఆర్, కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్‌ఎస్ నేతలు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అని నినదించారు. ఈ దీక్షలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్, రాములు నాయక్, రెడ్యానాయక్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ దీక్షపై స్పందించిన బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్.. ఇదంతా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమని విమర్శించారు. ఇలాంటి దీక్షలతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు కోసం ఏడేళ్లుగా ఎన్నడూ పార్లమెంట్ ను స్తంభింపజేయని టీఆర్ఎస్ ఎంపీలు.. అకస్మాత్తుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ, తస్మాత్ జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు.