ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర వైఖరిని నిరిసిస్తూ.. టీఆర్‌ఎస్ శ్రేణులు జాతీయ రహదారుల్లో రాస్తారోకోలు నిర్వహించారు. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. నాగ్ పూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ నాలుగు జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు టీఆర్‌ఎస్ నేతలు.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ పిలుపు మేరకు ఆయన బెంగుళూరు జాతీయ రహదారిలోని బూత్పూర్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు.
నిర్మల్ జిల్లా కడ్తాల్ వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ నేషనల్ హైవేపై ఎమ్మెల్యేలు లింగయ్య, రవీంద్ర ధర్నా చేశారు. ఈ ధర్నాతో మూడు కిలో మీటర్లు ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం తీరు సరిగ్గా లేదని ఫైరయ్యారు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఉప్పల్ చౌరస్తాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన రాస్తారోకో నిర్వహించారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు టీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత పాల్గొన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రమే కొనాలన్నారు.
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు జోగు రామన్న. ఆదిలాబాద్-నాగపూర్ హైవేపై రాస్తారోకో చేశారాయన.
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని విజయవాడ రాహదారిపై ఎమ్మెల్సీ దయానంద్ తో కలిసి రాస్తారోకో నిర్వహించారు నేతలు.
కోదాడలో టీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనకు దిగారు. రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్-విజయవాడ రహదారిపై ధర్నా చేశారు.
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వివేకానంద్. కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా పరిధిలో నాగపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు.