కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎటాక్ కొనసాగుతోంది. ఒకరి తర్వాత ఒకరు నేతలు రియాక్ట్ అవుతున్నారు. ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో షా చేసిన ఒక్కో కామెంట్ కు కౌంటర్ ఇచ్చేలా ప్రెస్ మీట్లు, ట్వీట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. ‘‘వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు’’ అంటూ షాను ఉద్దేశించి సైటైర్ వేశారు మంత్రి కేటీఆర్. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని, ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు. బీజేపీ అంటే ‘బక్వాస్ జుమ్లా పార్టీ’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.
మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లారు.. ఇప్పుడు మరో టూరిస్ట్ అంటూ మండిపడ్డారు కేటీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్ నడుస్తోందని ఎద్దేవ చేశారు. ఇక హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా అన్నీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. వరంగల్ సైనిక్ స్కూల్, కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చినా ఇవ్వలేదని చెప్పారన్నారు.
రాష్ట్రానికి వైద్య కళాశాలలు ఇవ్వకుండా మోసం చేస్తోంది కేంద్రం కాదా? అని నిలదీశారు. పంచాయతీలకు ఇంకా రూ.1,000 కోట్లు రావాల్సి ఉందని.. తెలంగాణ ఆదాయాన్ని యూపీ, గుజరాత్ లో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీని ముంచారని.. ఉపాధి హామీ నిధుల్లో రూ.25వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు.
కేసీఆర్ తెలంగాణ గాంధీ అని అభివర్ణించిన ఎర్రబెల్లి.. ఆయన కుటుంబం పదవుల కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. బీజేపీ నాయకుల బోగస్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని.. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కమలనాథులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.