మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసుపై టీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిందితులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించదన్న జీవన్ రెడ్డి.. దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
కుట్రలోని పాత్రధారులు జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని నిలదీశారు. కిడ్నాప్ ల గురించి డీకే అరుణకు ముందే ఎలా తెలుసన్నారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారుకూడా దోషులే అని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సీపీని కోరుతామన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం దారుణమన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
పాలమూరు ప్రశాంతమైన జిల్లా అని.. ఆ వాతావరణం కలుషితం కావొద్దన్నారు నిరంజన్ రెడ్డి. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పారు.