జూబ్లీహిల్ బాలిక ఘనటలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఏం చేశారో చూశాం. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా మరో గులాబీ లీడర్ కుమారుడి క్రూరత్వం బయటపడింది. ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి లోబర్చుకుని వీడియో తీశాడు. మరో నలుగురు బాలికలను బెదిరించాడు. జనగామ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిల్పూర్ మండలం శ్రీపతిపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత గుర్రపు వెంకటేశ్వర్లు కి శ్యామ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను ప్రేమ పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పాడు. ట్రాప్ చేసి లోబరుచుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేస్తుండగా తన స్నేహితుడు సాంబరాజుతో వీడియో తీయించాడు.
వీరిద్దరూ అంతటితో ఆగలేదు. మరో నలుగురు బాలికలకు ఆ వీడియో చూపించి.. తాము చెప్పినట్లు వినకపోతే మీ వీడియోలు కూడా తీస్తామని బెదిరించారు. అంతేకాకుండా ఆ వీడియోను కొందరికి ఫార్వార్డ్ చేశారు. అది సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అయింది. విషయం బాధితురాలి కుటుంబసభ్యులకి తెలిసింది. చిల్పూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు బాలికను విచారించి నిందితులు గుర్రపు శ్యామ్, సాంబరాజును అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల్లో వీరితో పాటు మరో నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.