– తమిళిసై వ్యాఖ్యలపై టీఆర్ఎస్ గరంగరం
– బీజేపీ కార్యకర్త అంటూ ఫైర్
కేసీఆర్ జాతీయ రాజకీయాలు, ముందస్తు ఎన్నికలపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై గులాబీలు గుస్సా అయ్యారు. ఒకరి తర్వాత ఒకరు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానని మరచినట్టున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవ చేశారు. బీజేపీ కార్యకర్తలు చేసే కామెంట్స్ కూడా, గవర్నర్ నోటి వెంట రావడం విడ్డూరంగా వుందని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయాలు గవర్నర్ కు ఏం సంబంధమని, ఈ ఒక్క మాట చాలు ఆమె బీజేపీ కార్యకర్త అని చెప్పడానికి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తమిళిసై బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైరయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించే వారని గుర్తు చేశారు. ఇక తమిళిసై క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటం ఏంటని.. ఆమె ఏమైనా శాస్త్రవేత్తనా అంటూ ప్రశ్నించారు సుమన్.
మరోవైపు ఈ వివాదంలోకి సీపీఐ నేత నారాయణ కూడా ఎంటర్ అయ్యారు. గవర్నర్ కు రాజకీయాలతో ఏం సంబంధమన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరని, అసెంబ్లీ రద్దు చేయలేరని చెప్పడానికి ఆమెకు ఏం అవసరం ఉందని ప్రశ్నించారు. ఇది గవర్నర్ పరిధి కాదన్న ఆయన.. రాజకీయ వివాదాలతో కూడుకున్న పద్ధతిగా అనిపిస్తోందని చెప్పారు అందుకే తమిళిసైని తక్షణమే రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని.. అందుకే ప్రధానిని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నారని అందరూ భావిస్తున్నట్లు చెప్పారు. కానీ.. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని.. వెళ్లే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.