– రాకేష్ మృతిని టీఆర్‌ఎస్ వాడుకుంటోందా?
– అంతిమయాత్రలో గులాబీ జెండాలు
– డబ్బులిచ్చి జన సమీకరణ!
– కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారా?
– బీజేపీ నేతలు ఏమంటున్నారు?
– అసలు.. రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు?
– గులాబీలు పాల్గొన్న యాత్రకు ప్రతిపక్షాలు వెళ్లకూడదా?
సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్‌ఎస్ ప్రమేయం ఉందనే విమర్శల నేపథ్యంలో ఆపార్టీ నేతలు చేస్తున్న పనులు అనేక అనుమానాలను తావిస్తున్నాయి. అల్లర్లలో చనిపోయిన రాకేష్ కు వరంగల్ ఎంజీఎం నుంచి గొర్రెకుంట వరకు ర్యాలీ నిర్వహించారు. దీనికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల జెడ్పీచైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లతోపాటు టీఆర్ఎస్ పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు.
జిల్లాకు చెందిన యువకుడు చనిపోతే నేతలు వెళ్లి పరామర్శించడంలో తప్పులేదుగానీ టీఆర్‌ఎస్ జెండాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొనడమే వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అల్లర్ల వెనుక టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ గూండాలే ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు చనిపోయిన యువకుడి శవాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది.
జాతీయ రాజకీయాలంటూ జపం చేస్తున్న కేసీఆర్ కు మైలేజ్ తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్ నేతలు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీజేపీ. మరోవైపు అంతిమయాత్రలో జనానికి 200 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారనే వీడియోలు కొన్ని బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో అవి చక్కర్లు కొడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే.. రాకేష్ మృతిని టీఆర్‌ఎస్ రాజకీయంగా వాడుకుంటోందని మండిపడుతోంది బీజేపీ.
ఇటు రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ అయితే.. చంపించింది బీజేపీ అని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు శవయాత్రలో పాల్గొనొచ్చు.. టీఆర్‌ఎస్ జెండాలు పట్టుకుని యాత్ర చేయొచ్చుగానీ.. తాను వెళ్లడానికి ఎందుకీ అడ్డంకులు అని ప్రశ్నించారు. చావును కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి.