దళిత బంధుపై సొంత పార్టీ నుంచే వింత అనుభవాలు ఎదురవుతున్నాయి గులాబీ పార్టీకి. ఇన్నాళ్లు జయహో కేసీఆర్ అంటూ జేజేలు కొడుతూ వస్తున్న నేతలకే.. ఇప్పుడు రాను రాను జ్వరం పట్టుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలను చూస్తోంటే.. తమ అధినేత అత్యాశకేమైనా పోతున్నారా అన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి.
తొలిసారి ప్రగతి భవన్‌లో దళిత బంధుపై ఆఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఖుషీ అయ్యారు. కేసీఆర్ తమను గెలిపించే మరో తారకమంత్రాన్ని పట్టుకున్నారని తెగ మెచ్చుకున్నారు. నియోజకవర్గానికి వంద మందికి పథకం వర్తింపజేసినా సరే… పదుల వేల సంఖ్యలో ఓట్లు రాలడం ఖాయమని అంచనా వేశారు. కట్ చేస్తే.. తాజా పరిస్థితులను చూస్తోంటే వారికి దిమ్మతిరిగిపోతోంది. ఓ వైపు తమ నియోజకవర్గంలోనే దళితులు తమకెప్పుడు దళిత బంధు ఇస్తారని ప్రశ్నిస్తోంటే.. మరోవైపు తమకే బంధూ లేదా అని మిగిలిన వర్గాలు నిలదీస్తున్నాయి. అయితే హుజురాబాద్‌కు ఇచ్చేందుకే ముందు వెనకాడుతున్న కేసీఆర్.. ఎన్నికల నాటికి తమ నియోజకవర్గాల్లోనూ దళిత బంధు ఇవ్వగలరా? ఇస్తే ఎంత మందికి ఇస్తారు? పరిమిత సంఖ్యలో ఇస్తే మిగిలిన కుటుంబాలు ఎలా ఓట్లు వేస్తాయి? వారికేం సమాధానం చెప్పాలి? వంటి ప్రశ్నలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో గాలికిపోయే ముళ్ల కంపనేమైనా వెనక తగిలించుకుంటున్నామా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
అటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇప్పటికే కేసీఆర్ స్ట్రాటజీపై మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో.. అందరిలోనూ దళిత బంధు తుఫాన్ భయం మొదలైపోయింది. స్వయంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కడియమే అలా విశ్లేషిస్తోంటే.. అదివిన్న తర్వాత వారు నిజంగానే కేసీఆర్ ఏరికోరి ఓటమిని తెచ్చుకుంటున్నారేమోనన్న ఆందోళన కలుగుతోంది. దీంతో ఫస్ట్ టైం తమ బాస్ పై లోలోపల బ్లాస్ట్ అవుతున్నారు.
అసలు కుటుంబానికి రూ. 10 లక్షలు ఎవరు ఇవ్వమని అడిగారు? ఆని లోలోపలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ. 10 లక్షలు కాకుండా రైతు బంధులాగా విడతలవారీగా రూ. లక్షో, రూ. 2లక్షలో ఇస్తే బాగుండేదని.. అప్పుడు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా సమస్య ఉండేది కాదని చెప్పుకుంటున్నారు. అలా రెండు, మూడు విడతలు ఇచ్చి మరోసారి ముందస్తు ఎన్నికలకు పోయినా విజయం ఖాయంగా ఉండేదని.. కానీ అలాకాకుండా ఒకేసారి రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించి కేసీఆర్ గులాబీ పార్టీకి తానే స్వయంగా గొయ్యి తవ్వారేమోనని అని దిగులుపడుతున్నారు. ఒక్క ఉప ఎన్నిక కోసం.. నూటొక్క మంది గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నారేమోనని ఎవరికి వారు బావురుమంటున్నారు. దళిత బంధు తమ పొలిటికల్ కెరీర్ కు ఉరితాడుగా మారబోతుందేమోనని ఉసూరుమంటున్నారు