రాష్ట్రం ఏర్పడేనాటికి మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం పది వేల కోట్లు.. కానీ.. ఇప్పుడది 40వేల కోట్లకు చేరింది. దీన్నిబట్టే అర్థం అవుతోంది.. కేసీఆర్ పాలనలో మద్యం ఏరులై పారుతోందని. జనాన్ని మత్తులో ఉంచేసి పాలన సాగించేద్దామని గులాబీలు గట్టిగా ఫిక్స్ అయ్యారు కాబట్టే.. ఆదాయం అంతగా రెట్టింపు అయ్యిందని అంటున్నాయి ప్రతిపక్షాలు. మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాన్ని ఓ ఆడుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పల్లె ప్రగతి కార్యక్రమంలో హన్మకొండ జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా తాగి పడేసిన మద్యం సీసాలమ్మి గ్రామ పంచాయతీలకు ఆదాయం తెస్తున్నామని అన్నారు. పైగా మీ మొగుళ్లు తాగి పారేసిన సీసాలు జమ చేసి ఆదాయాన్ని రాబడుతున్నాం తెలుసా అని మహిళలతో అన్నారు. సీసాల లెక్క తెలిస్తే ఊళ్ళో తాగేటోళ్ల సంఖ్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుస్తుందని చెప్పారు.
తాగి పడేసిన సీసాలు అమ్మితే వచ్చిన ఆదాయం ఎంత అని కార్యదర్శులను అడిగిన దానికి లెక్కలతో సహా వివరించారు ఎర్రబెల్లి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి గ్రామ పంచాయతీకి రూ.1500, హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ పంచాయతీకి రూ.2,500 ఆదాయం వచ్చిందని చాలా గొప్పగా చెప్పారు. ఇది చాలదన్నట్టు ఆడోళ్లు అంతా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదంతా చూస్తుంటే ప్రభుత్వాన్ని, గ్రామ పంచాయతీలను మందుబాబులే ఆదుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ఒక వైపు మద్యం తాగి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చడంతోపాటు.. తాగిన సీసాలు గ్రామాల్లో పడేసి పంచాయతీలకు కూడా ఆదాయం తెస్తున్నారని అనుకుంటున్నారు అంతా. అయితే.. మంత్రి మాటలు విని నవ్వుకోవాలో ఎడవాలో తెలియని పరిస్థితి ఉందని స్థానికుల అసహనం వ్యక్తం చేశారు. మద్యం సేవించడంతో జరిగే అనర్థాలను పక్కన పెట్టి.. సీసాలు అమ్మితే వచ్చే ఆదాయం గురించి మాట్లాడడంపై మండిపడుతున్నారు.