తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి వివాహ వేడుకలో ఊహించని అనుభవం ఎదురైంది. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు శ్రీనివాస్ గౌడ్ హాజరుకాగా.. ఆయన కుడిచేతి బంగారు కడియాన్ని ఎవరో తస్కరించారు. వివాహ వేడుకలో చాలామంది మంత్రితో సెల్ఫీలకు పోటీపడగా.. కాదనలేక ఆయన అందరితో సెల్ఫీలు దిగారు. తీరా సెల్ఫీ తతంగం అయ్యాక చూసుకుంటే.. చేతికి ఉండే కడియం మాయమైంది. దీంతో ఎంత పనైపోయింది అని మంత్రి నిట్టూర్చినట్టు సమాచారం.
కడియాన్ని శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంటుగా భావిస్తారని అనుచరులు చెబుతున్నారు. అందుకే అక్కడే ఉన్న పోలీసులు, గన్‌మెన్లపై ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తన కడియాన్ని దొంగిలించిందెవరో గుర్తించి.. తిరిగి తీసుకురావాలని వారిని ఆదేశించినట్టు సమాచారం. మంత్రి ఆగ్రహంతో పోలీసులు.. పెళ్లి వేడుకకు వచ్చిన వారిని కడియం గురించి ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఎవరైనా కడియం తస్కరించి ఉంటే.. తిరిగి ఇచ్చేయాలని అక్కడికి వచ్చినవారికి విజ్ఞప్తి చేశారట. మొత్తం మీద పెళ్లి వేడుక కోసం వెళ్లిన శ్రీనివాస్ గౌడ్‌కు అనుకోని చేదు అనుభవం ఎదురైంది.
ఓ అజ్ఞాత వ్యక్తి దేవరకద్ర పోలీస్ స్టేషన్ లోకి వచ్చి… నాకు బయట ఈ కడియం దొరికింది సార్..మీకు తెచ్చి ఇస్తున్నా అంటూ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్ చేతి బంగారు కడియంను అప్పజెప్పి వెళ్లాడు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.