మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం జనాన్ని బ్లాక్‌మెయిల్ చేశారు. టీఆర్ఎస్‌కు ఓట్లు తక్కువ పడితే నీళ్లు కూడా ఇవ్వనని.. ఎక్కడికక్కడ పనులని నిలిపివేస్తానని హెచ్చరించారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున బుడగజంగాల కాలనీలో ప్రచారం నిర్వహించిన ఆయన ఇలా బెదిరించారు.
” యాదయ్య జెప్పినట్టు ఎలక్షన్లు కాబట్టి వాళ్లు, వీళ్లు మస్తు వస్తరు.. మస్తు చెప్తరు.. ఎవని చేతిల ఏం లేదు.. ఏదిచ్చినా మనమే ఇయ్యాలే.. పొరపాటున ఏమన్నా జరిగి తక్కువ ఓట్లు వచ్చినయనుకో నీళ్లు గూడా ఇయ్య.. అర్థమైందా.. తాగుడుకో, తినుడుకో, బీరుకో, బిర్యానికో ఆశపడితే.. ఎక్కడక్కడ ఆపుజేస్తా..” అంటూ లక్ష్మారెడ్డి హెచ్చరించిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలపాలయ్యారు లక్ష్మారెడ్డి. మంచి చేస్తే ప్రజలు మరిచిపోతున్నారని.. అందుకే సంక్షేమ పథకాలు రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరుతానంటూ కామెంట్లు చేశారు. సంక్షేమ పథకాలను రద్దు చేసి ఎన్నికలకు ఏడాది ముందు అమలు చేస్తే తెలుస్తుందని అప్పట్లో మాట్లాడి జనంలో పలుచనయ్యారు. ఇప్పుడు అలాగే మాట్లాడి తానేం మారలేదని నిరూపించుకున్నారు లక్ష్మారెడ్డి.