ఉగాది తర్వాత వడ్ల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు తెలంగాణ మంత్రులు. శుక్రవారం సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపిన మంత్రులు.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉందన్నారు. రాష్ట్రాలతో కేంద్రం అనుసరిస్తున్న తీరు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జెడ్పీలలో కేంద్రం ధాన్యం కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని తెలిపారు. యూపీఎ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దేశంలో పండించిన వ్యవసాయ పంటలను కొనే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు నిరంజన్ రెడ్డి. కిషన్‌రెడ్డి చచ్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా.. వడ్లు కొనాలని ఎందుకు చెప్పడం లేదని మండిపడ్డారు.
పీయూష్ గోయల్ మంత్రిగా కాకుండా ప్రైవేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మైండ్ లేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒంట్లో నెత్తురు ఉంటే కేంద్రం చేత ధాన్యాన్ని కొనిపించాలన్నారు. పీయూష్ గోయల్ స్వయంగా ఫోన్ చేసినా కిషన్ రెడ్డి మీటింగ్ కు రాలేదని వివరించారు. ధాన్యం కొనాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగటం లేదన్నారు. బీజేపీ,కాంగ్రెస్ రెండు ఒక్కటే అని దీన్నిబట్టి మరోసారి రుజువైందని ఆరోపించారు.
కేంద్రం ఐదుసార్లు అవమానించినా భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి.. ఒక్కసారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రం కావాలనే తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేము చేసిన ప్రయత్నాలన్నీ కిషన్ రెడ్డికి తెలిసేలా లేఖలు పంపిస్తామని.. వాటిని చూసి అయినా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నించాలని కోరుతున్నట్లు చెప్పారు గంగుల.
ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆ తర్వాత నూకెవరు? పొట్టు ఎవరు అనేది తేలుస్తామని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని ఘాటైన విమర్శలు చేశారు పువ్వాడ.